Cyber Crime: ‘సీబీఐ’ అంటూ ఫోన్ చేసి 1.23 కోట్లు కాజేశారు
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:12 AM
మేం సీబీఐ నుంచి ఫోన్ చేస్తున్నాం. మనీ ల్యాండరింగ్ కేసులో మీపై సుప్రీంకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
అద్దంకిలో రిటైర్డ్ జీఎంకు సైబర్ నేరగాళ్లు టోకరా
అద్దంకి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ‘మేం సీబీఐ నుంచి ఫోన్ చేస్తున్నాం. మనీ ల్యాండరింగ్ కేసులో మీపై సుప్రీంకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బెయిల్ మంజూరు కావాలంటే డబ్బులు చెల్లించాలి’ అని బెదిరించిన సైబర్ నేరగాళ్లు ఓ రిటైర్డ్ జీఎం నుంచి రూ.1.23 కోట్లు కాజేశారు. దీనిపై బాధితుడు బుధవారం ప్రకాశం జిల్లా అద్దంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అద్దంకి పట్టణంలోని ప్రముఖ ఆర్యవైశ్య నేత, స్మాల్ ఇండస్ట్రీస్ డెవల్‌పమెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జీఎంగా పనిచేసి 20 ఏళ్ల క్రితం రిటైరైన ఎస్.నాగేశ్వరరావుకు మూడు వారాల క్రితం సీబీఐ అధికారులం అంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. మనీల్యాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్నావని, సుప్రీం కో ర్టు, సీబీఐ నుంచి అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందని, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించారు. ఆ కేసులో బెయిల్ కావాలంటే కొంత మొత్తంలో డబ్బు తమ ఖాతాలో జమచేయాలని నమ్మబలికారు. విష యం బయటకు చెబితే అరెస్టు తప్పదని హెచ్చరించారు. దీంతో భయపడిపోయిన నాగేశ్వరరావు అద్దంకిలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి మూడు విడతలుగా రూ.1.23 కోట్లను వారి చెప్పిన ఖాతాలకు జమ చేశారు. మంగళవారం మరోసారి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. నాగేశ్వరరావు తన వద్ద లేవని చెప్పడంతో.. ఇల్లు అమ్మి అయినా సరే చెల్లించాల్సిందేనని బెదిరించారు. ఇప్పటికిప్పుడు ఇల్లు అమ్మటం సాధ్యం కాదని చెప్పినా వినలేదు. దీంతో ఎలాగూ విషయం బయటపడుతుందని భావించిన నాగేశ్వరరావు బంధువులు, కుటుంబ సభ్యులకు తెలిపారు. వారి సాయంతో పోలీస్ సైబర్ వింగ్ ట్రోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేశారు.