CBI Investigation: నెయ్యి కల్తీ కేసులో చివరి లెక్కలు!!
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:38 AM
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు చివరి దశకు చేరిందన్న సంకేతాలు కనబడుతున్నాయి.
తిరుపతికి సీబీఐ జాయింట్ డైరెక్టర్
తిరుపతి(నేరవిభాగం), జనవరి 10 (ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు చివరి దశకు చేరిందన్న సంకేతాలు కనబడుతున్నాయి. దాదాపు 14 నెలలుగా కొనసాగుతున్న ఈ కేసు దర్యాప్తునకు సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు తొలిసారిగా శనివారం తిరుపతిలోని ప్రత్యేక సిట్ దర్యాప్తు కార్యాలయానికి రావడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. 2024 నవంబరులో ప్రారంభమైన ఈ కేసు సంచలనంగా మారింది. దేశ విదేశాల్లో శ్రీవారి భక్తులు ఈ కేసు దర్యాప్తును నిశితంగా పరిశీలిస్తున్నారు. కల్తీ నెయ్యిలో ఎవరి పాత్ర ఎంతన్న విషయంపై స్పష్టత వస్తే ఆ ప్రభావం రాజకీయంగా కూడా పెను మార్పులకు దారితీయొచ్చు. ఈ క్రమంలో సీబీఐ జేడీ స్థాయి అధికారి తిరుపతికి రావడం చార్జిషీట్ దాఖలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందస్తు అడుగుగా కనిపిస్తోంది. ఈ కీలక పర్యటనలో వీరేష్ ప్రభుతోపాటు డీఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి, గోపీనాథ్ జెట్టి, ఎఫ్‌సీసీఐ అధికారి సత్యవర పాండా సహా పలువురు సిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీబీఐ జేడీ అధికారులు, సిట్ సభ్యులతో కేసుకు సంబంధించి ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన సమీక్షలో ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించినట్టు సమాచారం. సేకరించిన సాక్ష్యాలు, నిందితుల వాంగ్మూలాలు, దర్యాప్తు విధానంపై సీబీఐ జేడీ స్వయంగా సమీక్షించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కోర్టులో కేసు నిలబడేలా ఎలాంటి న్యాయపరమైన లోపాలూ ఉండకూడదన్న అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. ఈ కేసులో దర్యాప్తునకు సహకరించే అవకాశం ఉన్న నిందితులు ఎవరు? ఎవరి వాంగ్మూలాలు కీలకమన్న కోణంలోనూ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అవసరమైతే కీలక సాక్షులను ప్రభుత్వ సాక్షులుగా మార్చే అంశంపైనా ప్రాథమికంగా సమీక్షించినట్టు సమాచారం. కేసులో సీబీఐ విచారణ దాదాపు పూర్తయినట్టే కాగా, 15-20 రోజుల్లో చార్జిషీట్ దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి.