CBI Issues Summons to TVK Leader Vijay: టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ సమన్లు
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:41 AM
కరూర్ తొక్కిసలాట కేసులో ఈనెల 12న విచారణకు హాజరుకావాలని టీవీకే పార్టీ అధ్యక్షుడు, తమిళ నటుడు విజయ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది...
తొక్కిసలాట కేసులో 12న విచారణకు రావాలని నిర్దేశం
చెన్నై, జనవరి 6(ఆంధ్రజ్యోతి): కరూర్ తొక్కిసలాట కేసులో ఈనెల 12న విచారణకు హాజరుకావాలని టీవీకే పార్టీ అధ్యక్షుడు, తమిళ నటుడు విజయ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయనను విచారించనుంది. గతేడాది సెప్టెంబరు 27న తమిళనాడులోని కరూర్ నగరంలో విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించగా, 60 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై తొలుత తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) విచారణ చేపట్టింది. అయితే, స్వతంత్ర దర్యాప్తు కోరుతూ టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసును కోర్టు సీబీఐకి అప్పగించింది. అలాగే, దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. సీబీఐ అధికారులు ఇప్పటికే 200 మందికిపైగా ప్రత్యక్ష సాక్షులను విచారించారు. టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, సంయుక్త కార్యదర్శి నిర్మల్ కుమార్, ప్రచార కార్యదర్శి ఆదవ్ అర్జున్, కరూర్ వెస్ట్ జిల్లా కార్యదర్శి మదియళగన్‌లను కూడా విచారించారు. విజయ్ ప్రచారం చేపట్టిన వ్యాన్‌లోని సీసీ టీవీ ఫుటేజీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు విజయ్‌ను కూడా విచారించిన తర్వాత చార్జిషీటు దాఖలు చేసే అంశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు సీబీఐ అధికారులు తెలిపారు.