Share News

రూ.7 కోట్ల బోనస్‌ కోసం 15 లక్షలు లంచం

ABN , Publish Date - Aug 17 , 2026 | 04:13 AM

విజయవాడ రైల్వే డివిజన్‌లోని సిగ్నలింగ్‌ విభాగంలో ఓ సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీర్‌ రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికిపోయారు.

రూ.7 కోట్ల బోనస్‌ కోసం 15 లక్షలు లంచం

  • సీబీఐ అదుపులో రైల్వే సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీర్‌, సహాయకుడు

  • రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు.. నేడు కోర్టులో హాజరు

విజయవాడ/ విశాఖపట్నం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): విజయవాడ రైల్వే డివిజన్‌లోని సిగ్నలింగ్‌ విభాగంలో ఓ సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీర్‌ రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికిపోయారు. ఆ వివరాలను సీబీఐ అధికారులు ఆదివారం వెల్లడించారు. విజయవాడలోని చీఫ్‌ సిగ్నల్‌ అండ్‌ టెలీ కమ్యూనికేషన్స్‌ ఇంజనీర్‌ (ప్రాజెక్ట్స్‌) కార్యాలయంలో బాపిరాజు సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. గతంలో గుంతకల్లు డివిజన్‌లో పనిచేసిన ఆయన కొద్దినెలల క్రితం విజయవాడ డివిజన్‌కు బదిలీపై వచ్చారు. డివిజన్‌ పరిధిలో రూ.179.50 కోట్ల విలువైన ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ పనుల టెండర్‌ను రెండు కాంట్రాక్ట్‌ సంస్థలు జాయింట్‌ వెంచర్‌ కింద దక్కించుకున్నాయి. టెండర్‌ నిబంధనల ప్రకారం నిర్ణీత గడువు కంటే ముందుగానే కాంట్రాక్టర్లు పనులను పూర్తిచేశారు. దీనికి సంబంధించి వారికి రైల్వే నుంచి రూ.7 కోట్ల బోనస్‌ రావాల్సి ఉంది. దీనికోసం ఫైలుపై సంతకాలు చేసి, ముందు వేసిన తేదీని మార్చడంతో పాటు నగదు విడుదలకు లైన్‌క్లియర్‌ చేయడానికి రూ.15లక్షలు లంచం ఇవ్వాలని బాపిరాజు బేరం పెట్టారు. దీనిపై కాంట్రాక్టర్లు సీబీఐకి ఫిర్యాదు చేశారు. జాయింట్‌ వెంచర్‌ సంస్థలోని ఒక కంపెనీ ప్రతినిధి కుమారుడు ఆదివారం విశాఖ నుంచి విజయవాడ వచ్చే మార్గంలో లంచం మొత్తాన్ని అందజేస్తాడని సమాచారం ఇచ్చారు. ఈ డబ్బు తీసుకోవడానికి చందు అనే ప్రైవేట్‌ వ్యక్తిని బాపిరాజు సహాయకుడిగా నియమించుకున్నారు. కాంట్రాక్ట్‌ సంస్థ ప్రతినిధి కుమారుడి నుంచి లంచం డబ్బులు తీసుకుంటుండగా చందుతో పాటు బాపిరాజును సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


నిందితులను సోమవారం విజయవాడలోని సీబీఐ కోర్టులో హాజరుపర్చనున్నారు. విశాఖపట్నం, విజయవాడ, పిఠాపురం, హైదరాబాద్‌ల్లో బాపిరాజు భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు సీబీఐ గుర్తించింది. ఆయా ప్రాంతాల్లోని నివాసాల్లో వేర్వేరు బృందాలు సోదాలు నిర్వహించాయి. కాగా, రైల్వే కాంట్రాక్టర్ల నుంచి పనుల విలువను బట్టి ఇంజనీర్లు పర్సంటేజీలు తీసుకుంటారు. ఇప్పటి వరకు ఉన్న పర్సంటేజీని బాపిరాజు భారీగా పెంచినట్టు సమాచారం. ఆయన చెప్పినంత ఇస్తేనే ఫైలుకు గ్రీన్‌సిగ్నల్‌ పడుతుందని, లేకపోతే ఎన్ని రోజులైనా తొక్కిపెడతారని ఆరోపణలున్నాయి.

Updated Date - Aug 17 , 2026 | 04:14 AM