Share News

కుల గణన చేపట్టాలి

ABN , Publish Date - Feb 17 , 2026 | 05:00 AM

‘జన గణనలో సమగ్రంగా కుల గణన చేపట్టి జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.

కుల గణన చేపట్టాలి

  • బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి: ఈశ్వరయ్య

  • జగన్‌ను నమ్మే పరిస్థితుల్లో జనం లేరు

  • ఆయన మళ్లీ అధికారంలోకి రావడం కల్ల: నారాయణ

కాకినాడ, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): ‘జన గణనలో సమగ్రంగా కుల గణన చేపట్టి జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి. రాజకీయ, సామాజిక ఆర్థిక సమానత్వం కోసం క్రియాశీలక పోరాటాలకు సన్నద్ధం కావాలి’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. సోమవారం కాకినాడలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు అధ్యక్షతన రాష్ట్ర సమితి సమావేశాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో పార్టీ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, సీనియర్‌ నేత నారాయణ పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడారు. ‘గత స్థానిక ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన స్థానాలు తగ్గించడం వల్ల వేల సంఖ్యలో స్థానిక సంస్థల పదవులను బీసీలు కోల్పోయారు. తెలంగాణ ప్రభుత్వం జనాభా లెక్కల సందర్భంగా కుల గణన చేపట్టి అందుకనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయిస్తూ అసెంబ్లీలో రెండు బిల్లులు ఆమోదించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ చేపట్టి, కులాల ప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయించాలి. ఆ ప్రాతిపదికన చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి. కుల వృత్తులకు సంబంధించి చిన్నచిన్న పరికరాలు అందించి ఓట్లు దండుకుంటున్నారు. ఇది ఆధునిక బానిసత్వం. ఓట్లు, సీట్లు పొందుతున్న రాజకీయ పార్టీలేవీ బీసీల అభివృద్ధి గురించి మాట్లావు. అన్ని రాజకీయ పార్టీలతో జన గణనలో, కుల గణన జరిపించాలని తీర్మానం చేయించి అందుకు కావలసిన కార్యాచరణ తీసుకొచ్చేలా ఆయా రాజకీయ పార్టీల బీసీ నేతలు ఒత్తిడి తీసుకురావాలి’ అని విజ్ఞప్తి చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ... తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి నరేంద్ర మోదీ బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలి. రాష్ట్ర ఎంపీల మద్దతుతో కేంద్రంలో ఉన్న ఆయన అన్ని విధాలా ఏపీకి సహకరించాలి. పోలవరం పూర్తి చేయాలి.


కోస్టల్‌ కారిడార్‌లో పరిశ్రమలను ఏర్పాటు చేయాలి’ అని కోరారు. నారాయణ మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో ఇక ప్రజలు వైసీపీ అధినేత జగన్‌ను నమ్మే పరిస్థితిల్లో లేరు. ఇక ఆయన అధికారంలోకి రావడం కల్ల. కూటమి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఎదిగేలా పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య, అక్కినేని వనజ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణ మూర్తి, పి.హరినాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2026 | 05:01 AM