Eluru District: సారా అమ్ముతున్నాడని కుల బహిష్కరణ
ABN , Publish Date - Jan 05 , 2026 | 05:17 AM
సారా అమ్ముతున్న ఓ వ్యక్తిని విక్రయాలు నిలిపివేయాలని.. లేదంటే రూ.లక్ష జరిమానా చెల్లించాలని కులపెద్దలు ఆదేశించారు. వారి ఆదేశాలు ఖాతరు చేయనందుకు ఆ వ్యక్తితోపాటు...
కుటుంబంతో సహా మోకాళ్లపై నిలబెట్టి శిక్ష
విక్రయాలు ఆపకపోతే జరిమానా హెచ్చరిక
ఆత్మహత్య చేసుకుంటామంటూ బాధితుడి సెల్ఫీ వీడియో
ముసునూరు, జనవరి 4(ఆంధ్రజ్యోతి): సారా అమ్ముతున్న ఓ వ్యక్తిని విక్రయాలు నిలిపివేయాలని.. లేదంటే రూ.లక్ష జరిమానా చెల్లించాలని కులపెద్దలు ఆదేశించారు. వారి ఆదేశాలు ఖాతరు చేయనందుకు ఆ వ్యక్తితోపాటు ఆయన కుటుంబానికి కుల బహిష్కరణ విధించారు. మనస్తాపానికి గురైన ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నామంటూ సెల్ఫీ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం లోపూడి గ్రామానికి చెందిన బోట్ల కనకరావు సారా విక్రయాలు సాగిస్తుండేవాడు. ఎక్సైజ్ అధికారులు అతనిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. కనకరావు ఇటీవలే జైలు నుంచి విడుదలవగా.. పది రోజుల క్రితం పంచాయితీ పెట్టిన కులపెద్దలు సారా విక్రయాలు మానేయాలని, లేకుంటే రూ.లక్ష జరిమానా విధిస్తామని తెలిపారు. జరిమానా కట్టకపోతే కుల బహిష్కరణ విధిస్తామని హెచ్చరించారు. కనకరావు వారి మాటను వ్యతిరేకించడంతో ఆగ్రహించిన కుల పెద్దలు కనకరావుతోపాటు ఆయన కుటుంబసభ్యులను మోకాళ్లపై నిలబెట్టి కుల బహిష్కరణ విధించారు. ఈ నెల 3న కనకరావు సామాజిక వర్గీయుల ఇళ్లకు వెళ్లి ఆ కుటుంబాన్ని వెలి వేశామని, ఎవరూ వారితో మాట్లాడవద్దని చెప్పారు. మనస్తాపానికి గురైన కనకరావు తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నామని, దీనికి కుల పెద్దలు సుదగాని రాంబాబు, చలమాల వెంకటేశ్వరరావు, ఆరేపల్లి నాగేశ్వరరావు, వీరంకి గంగరాజు, పంది శ్రీనివాసరావు, తాళం శ్రీరాములు.. కారణమని పేర్కొంటూ ఆదివారం ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ప్రసుత్తం బాధిత కుటుంబం గ్రామంలో కనిపించడం లేదు. బాధితుడి తండ్రి బోట్ల నాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కుల పెద్దలను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబం అచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.