Share News

జీడిమామిడి రైతు డీలా

ABN , Publish Date - Apr 05 , 2026 | 11:11 PM

వాతావరణంలో మార్పుతో జీడిమామిడి పూత మారిపోయింది. లేత పిక్కలు రాలిపోయాయి. పూత, పిందె సమయంలో పొగమంచు, ఈదురు గాలులతో కూడిన వర్షాల వలన జీడిమామిడి రైతులకు నష్టం వాటిల్లింది.

జీడిమామిడి రైతు డీలా
ఈదురు గాలులకు పూత, పిందె రాలిపోయిన జీడిమామిడి చెట్టు

పూత, పిందె దశలో దెబ్బతీసిన వాతావరణం

పొగమంచు, మబ్బులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలతో తగ్గిపోయిన దిగుబడి

కొయ్యూరు, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): వాతావరణంలో మార్పుతో జీడిమామిడి పూత మారిపోయింది. లేత పిక్కలు రాలిపోయాయి. పూత, పిందె సమయంలో పొగమంచు, ఈదురు గాలులతో కూడిన వర్షాల వలన జీడిమామిడి రైతులకు నష్టం వాటిల్లింది.

మండలంలో సుమారు 30 వేల ఎకరాలకు పైబడి జీడిమామిడి సాగవుతుండగా, 70 శాతం రైతాంగం జీడిమామిడి ఫలసాయం ఆధారంగానే జీవనం సాగిస్తున్నారు. ఈ సంవత్సరం సీజన్‌ ఆరంభంలో వాతావరణం ఆశాజనకంగా ఉన్నప్పటికీ గత 20 రోజులుగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు జీడిమామిడిపై తీవ్ర ప్రభావం చూపాయి. పూత దశ నుంచి పిందె దశకు వస్తున్న సమయంలో విపరీతమైన పొగమంచు(తేనె మంచు), దట్టంగా మబ్బులు కమ్ముకోవడం కారణంగా పూత మాడిపోయింది. దీనికి తోడు ఇటీవల ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలకు ఉన్న కొద్దిపాటి పిందెలు రాలిపోవడం, కుళ్లిపోవడం వలన రైతులకు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రస్తుతం జీడిమామిడి పిక్కలు 80 కిలోల బస్తా ధర రూ.12,500 నుంచి రూ.14 వేల మధ్యలో పలుకుతూ ఆశాజనకంగా ఉన్నా దిగుబడి లేకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. గత ఏడాది ఇదే సమయానికి మండలం నుంచి రెండు నుంచి మూడు లోడ్‌ల (25 నుంచి 30 టన్నులు) పిక్కలు బహిరంగ మార్కెట్‌కు రవాణా అయ్యాయి. అయితే ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఒక్క లోడు(10 టన్నులు) కూడా వెళ్లని దుస్థితి నెలకొంది. దీనిని బట్టి చూస్తే దాదాపు 60 శాతం దిగుబడి తగ్గిందని అంచనా. 30 వేల ఎకరాలకు పైబడి విస్తరించి ఉన్న జీడిమామిడి తోటల్లో కనీసం సగభాగం కూడా పంట బాగుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని జీడిమామిడి రైతులు కోరుతున్నారు.

Updated Date - Apr 05 , 2026 | 11:11 PM