Share News

చంద్రబోస్‌ సోదరుడి మృతిపై కేసు నమోదు

ABN , Publish Date - May 06 , 2026 | 04:38 AM

అన్నమయ్య జిల్లా కలికిరిలో ఆదివారం మరణించిన ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌ సోదరుడు రాజేందర్‌ మృతిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

చంద్రబోస్‌ సోదరుడి మృతిపై కేసు నమోదు

  • మృతదేహంపై గాయాలున్నట్టు భార్య ఫిర్యాదు

కలికిరి, మే 5 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా కలికిరిలో ఆదివారం మరణించిన ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌ సోదరుడు రాజేందర్‌ మృతిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. హైదరాబాదులో నివసించే రాజేందర్‌ రెండు వారాల కిందట రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిమిత్తం కలికిరి వచ్చి ఒక స్నేహితుడి గదిలో గడిపారు. ఆదివారం ఉదయం అస్వస్థతగా ఉండడంతో స్థానికంగా ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అక్కడి నుంచి గాంధీ చౌరస్తాలోని ఒక హోటల్‌లో టిఫిన్‌ తిని వెలుపలికి వచ్చి ఉన్నట్టుండి కుప్పకూలి రోడ్డుపైనే పడి ప్రాణాలొదిలారు. హైదరాబాదులోని కుటుంబ సభ్యులకు పోలీసులు ఈ సమాచారం అందించి, రాజేందర్‌ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. కుటుంబ సభ్యులు తమకు కేసు అవసరం లేదని బంధువులకు మృతదేహాన్ని అప్పగించాలని కోరడంతో అలాగే చేశారు. అయితే హైదరాబాదుకు చేరుకున్నాక రాజేందర్‌ మృతదేహంపై గాయాలున్నట్టు గుర్తించి, ఆయన భార్య వసంత సైబరాబాద్‌ పరిధిలోని దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాజేందర్‌ గత నెల 18న శ్రీనివాస రెడ్డి, సుధీర్‌ రెడ్డితో కలిసి హైదరాబాద్‌ నుంచి వెళ్లినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త మృతదేహంపై గాయాలున్నాయని, విచారణ చేయించాలని కోరారు. ఈ ఫిర్యాదుపై దుండిగల్‌ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కలికిరి పోలీసులకు పంపారు. దీనిపై కేసు నమోదు చేసి రాజేందర్‌ మృతదేహానికి పోస్టుమార్టం చేయించడానికి సీఐ అనిల్‌కుమార్‌, మరో ఏఎ్‌సఐ హైదరాబాదు వెళ్లారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, శవపరీక్ష కూడా పూర్తయినట్టు కలికిరి సీఐ అనిల్‌కుమార్‌ తెలిపారు. కుటుంబీకుల నుంచి వాంగ్మూలం కూడా తీసుకున్నామని, కేసు దర్యాప్తు చేయనున్నట్టు ఆయన వివరించారు.

Updated Date - May 06 , 2026 | 04:39 AM