క్యారెట్, బీట్రూట్ ధరలు ఢమాల్
ABN , Publish Date - Feb 22 , 2026 | 03:52 AM
కూరగాయల మార్కెట్లలో డిమాండ్‌గా అమ్ముడయ్యే క్యారెట్, బీట్రూట్ ధరలు పడిపోయాయి. ఒకప్పుడు సెంచరీలు కొట్టిన క్యారెట్, బీట్రూట్ ఇప్పుడు రూ.100కు మూడు కిలోల చొప్పున ఇంటి ముందుకే వస్తున్నాయి.
రూ.100కు 3కిలోలు ఇస్తున్న రిటైలర్లు
అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): కూరగాయల మార్కెట్లలో డిమాండ్‌గా అమ్ముడయ్యే క్యారెట్, బీట్రూట్ ధరలు పడిపోయాయి. ఒకప్పుడు సెంచరీలు కొట్టిన క్యారెట్, బీట్రూట్ ఇప్పుడు రూ.100కు మూడు కిలోల చొప్పున ఇంటి ముందుకే వస్తున్నాయి. సాధారణంగా కిలో రూ.50నుంచి రూ.80 వరకు పలికే క్యారెట్, బీట్రూట్ ఒక్కోసారి రూ.100కు చేరుతుంటాయి. అలాంటివి గత కొన్ని రోజులుగా మార్కెట్లలో కిలో రూ.40లోపే లభ్యమౌతున్నాయి. రైతుబజార్లలో అయితే కిలో రూ.32కే దొరుకుతున్నాయి. క్యారెట్ పంటను ఏపీ, తెలంగాణతోపాటు హరియాణ, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో పండిస్తున్నారు. బీట్రూట్ పంట మహారాష్ట్ర, హరియాణ, ఉత్తరప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో పండిస్తారు. ఈ ఏడాది తమిళనాడు, కర్ణాటకలో క్యారెట్, బీట్రూట్ ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో ఏపీకి దిగుమతి పెరిగింది. ఈ కారణంగా ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.