Share News

శ్రీసిటీకి మరో దిగ్గజ సంస్థ

ABN , Publish Date - Apr 30 , 2026 | 04:01 AM

అమెరికాకు చెందిన దిగ్గజ ఎయిర్‌ కండిషనర్‌ తయారీ సంస్థ ‘క్యారియర్‌’ రాష్ట్రంలో ఉత్పత్తి సంస్థను ప్రారంభించనుంది. ఈమేరకు వచ్చే నెల ఆరో తేదీన శ్రీసిటీలో ...

శ్రీసిటీకి మరో దిగ్గజ సంస్థ

  • రూ.1000 కోట్లతో ‘క్యారియర్‌’ ఏసీల పరిశ్రమ

  • 3000 మందికి ఉపాధి అవకాశాలు

అమరావతి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): అమెరికాకు చెందిన దిగ్గజ ఎయిర్‌ కండిషనర్‌ తయారీ సంస్థ ‘క్యారియర్‌’ రాష్ట్రంలో ఉత్పత్తి సంస్థను ప్రారంభించనుంది. ఈమేరకు వచ్చే నెల ఆరో తేదీన శ్రీసిటీలో ఆ సంస్థ సీఎండీ డేవిడ్‌ గిట్లిన్‌ శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజున కలెక్టర్ల కాన్ఫరెన్సు కారణంగా ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కావడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌, మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ హాజరయ్యే అవకాశముందని అధికారవర్గాలు వెల్లడించాయి. రూ.1000 కోట్ల పెట్టుబడితో గృహేతర వినియోగానికి సంబంధించిన భారీ ఎయిర్‌ కండిషనర్లను ఈ సంస్థ తయారు చేయనుంది. గృహ, వాణిజ్య వినియోగానికి ఒక టన్ను నుంచి రెండు టన్నుల సామర్థ్యం కలిగిన ఏసీలను సరఫరా చేస్తున్న క్యారియర్‌ సంస్థలో.. రాష్ట్రంలో పారిశ్రామిక, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాల అభివృద్ధి నేపథ్యంలో 1000 నుంచి 5000 టన్నుల సామర్థ్యంతో కూడిన ఎయిర్‌ కండిషనర్లను తయారు చేయనున్నారు. వీటిని డేటా సెంటర్లలో వినియోగిస్తారు. విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌తో సహా ఇంకొన్ని డేటా సెంటర్లను స్థాపిస్తామంటూ రిలయన్స్‌తో సహా పలు దిగ్గజ సంస్థలు ప్రతిపాదించిన నేపథ్యంలో రాష్ట్రంలో భారీ సామర్థ్యంతో కూడిన ఎయిర్‌ కండిషనర్లకు డిమాండ్‌ రానున్నదని గ్రహించి ఈ యూనిట్‌ స్థాపనకు క్యారియర్‌ సిద్ధమైంది. ఈ సంస్థకు శ్రీ సిటీలో 39 ఎకరాలను కేటాయించారు. 3000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. శ్రీ సిటీలో తయారయ్యే భారీ ఎయిర్‌ కండిషనర్లను అమరావతిలో నిర్మించే సెక్రటేరియేట్‌ కాంప్లెక్స్‌లలోనూ వినియోగించే వీలుందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే క్యారియర్‌ సంస్థ ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) ఆమోదం లభించింది. ఇంకా, పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదం పరిశీలనలో ఉంది.

Updated Date - Apr 30 , 2026 | 04:01 AM