Share News

నిర్లక్ష్యమే!

ABN , Publish Date - May 04 , 2026 | 01:22 AM

జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఏడేళ్లుగా కృష్ణా యూనివర్సిటీ ప్రాంగణం మెరక పనులకు నోచుకోవడంలేదు. వర్సిటీలో స్టేడియం నిర్మాణ ప్రతిపాదనల అంశంపై స్పష్టత కొరవడింది. వ్యవసాయ పరిశోధనా క్షేత్రానికి ఐదేళ్ల కిందట భూమి కేటాయించినా.. అధికారికంగా నేటి వరకు పత్రాలు అందని పరిస్థితి నెలకొంది. అధికారులు, పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిర్లక్ష్యమే!

- కృష్ణా యూనివర్సిటీ ప్రాంగణం మెరక చేయకుండా ఏళ్ల తరబడి జాప్యం

- స్టేడియం నిర్మాణానికి ముందుకు పడని అడుగు

- వ్యవసాయ పరిశోధనా క్షేత్రానికి అధికారికంగా అందని భూమి పత్రాలు

- పట్టించుకోని అధికారులు, పాలకులు

- విమర్శలు చేస్తున్న ప్రజలు

జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఏడేళ్లుగా కృష్ణా యూనివర్సిటీ ప్రాంగణం మెరక పనులకు నోచుకోవడంలేదు. వర్సిటీలో స్టేడియం నిర్మాణ ప్రతిపాదనల అంశంపై స్పష్టత కొరవడింది. వ్యవసాయ పరిశోధనా క్షేత్రానికి ఐదేళ్ల కిందట భూమి కేటాయించినా.. అధికారికంగా నేటి వరకు పత్రాలు అందని పరిస్థితి నెలకొంది. అధికారులు, పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

కృష్ణా యూనివర్సిటీ ప్రాంగణం మెరక పనులు ఇప్పట్లో జరిగేలా కనిపించడంలేదు. భవనాల ముందు, యూనివర్సిటీకి వెళ్లేదారులు తప్ప మిగిలిన ప్రాంతాన్ని అలాగే వదిలేశారు. ఆదివారం నీట్‌ పరీక్ష ఇక్కడ జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు యూనివర్సిటీ ప్రాంగణాన్ని చూసి ముక్కున వేలేసుకున్నారు. బందరు మండలం రుద్రవరంలోని కృష్ణా వర్సిటీ ప్రాంగణం 102.50 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అకడమిక్‌ బ్లాక్‌, అడ్మినిస్టేటివ్‌ బ్లాక్‌లను రూ.87 కోట్ల వ్యయంతో నిర్మాణం చేశారు. భవనాలు, రహదారులు తప్ప యూనివర్సిటీ ప్రాంగణమంతా తుమ్మచెట్లు, పిచ్చమొక్కలు, గొతులతో నిండి ఉంది.

ప్రాంగణం మెరక చేసేందుకు అవకాశం ఉన్నా..

యూనివర్సిటీ ఆవరణ 102 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మచిలీపట్నం పోర్టులో డ్రెడ్జింగ్‌ చేసే మట్టితో యూనివర్సిటీ ప్రాంగణాన్ని మెరక చేసే ప్రతిపాదనను గతంలో చేశారు. కానీ వివిధ కారణాలతో ఆ ప్రతిపాదనను అమలు చేయకుండా నిలిపివేశారు. రూ.25 లక్షల అంచనాలతో ప్రాంగణాన్ని మెరక చేసేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపాదన పెట్టారు. మట్టిని ఉచితంగానే ఇస్తామని, వాహనాలకు సంబంధించిన రవాణా చార్జీలు యూనివర్సిటీనే భరించాలని అధికారులు చెప్పారు. దీంతో యూనివర్సిటీ నుంచి నగదు ఇవ్వలేమని యూనివర్సిటీ అధికారులు తేల్చి చెప్పడంతో ఈ ప్రతిపాదనకు బ్రేక్‌ పడింది. యూనివర్సిటీ వద్ద నిధులు ఉన్నా, ప్రభుత్వమే మెరక పనులకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని యూనివర్సిటీ అధికారులు పట్టుబట్టడంతో మెరక పనులు అంశం అటకెక్కింది.

స్ట్టేడియం సంగతేంటి?

కృష్ణా యూనివర్సిటీ 2008లో ఏర్పాటు కాగా, ఆంధ్రా జాతీయ కళాశాలలో పదేళ్ల పాటు నడిపారు. 2019 జనవరిలో రుద్రవరంలో నిర్మాణం చేసిన నూతన భవనాల్లోకి యూనివర్సిటీని తరలించారు. గత ఏడేళ్లుగా యూనివర్సిటీ స్థాయి, అంతర్‌ యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీలను విజయవాడ, తదితర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. 2019, 2024 ఎన్నికల సమయంలో జిల్లాకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్‌ ఇక్కడే జరిగింది. రెండు సార్లు ఎన్నికలకు సంబంధించిన అత్యవసర నిధులతో అడ్మినిసే్ట్రటివ్‌ బ్లాక్‌ ఎదురుగా ఉన్న ప్రాంగణాన్ని కొంతమేర చదును చేశారు. అకడమిక్‌ బ్లాక్‌ ముందు, చుట్టుపక్కల చదును చేసే పనులు ఇంత వరకు చేయనేలేదు. దీంతో యూనివర్సిటీ ప్రాంగణంలో ముళ్లచెట్లు పెరిగిపోయాయి. వీటిని తొలగించే పనులు కూడా చేయకపోవడం గమనార్హం. ఇటీవల యూనివర్సిటీ ప్రాంగణంలో స్టేడియం నిర్మాణం చేసే అంశంపై కలెక్టర్‌ యూనివర్సిటీ అధికారులతో సమావేశం నిర్వహించి, ప్రతిపాదనలు పంపాలని చెప్పారని యూనివర్సిటీ అధికారులే చెబుతున్నారు. అయితే ఈ ప్రతిపాదనలు పంపారా లేదా అనే అంశంపై అనుమానాలు ఉన్నాయి. ఈ వేసవిలో యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న ముళ్ల పొదలను తొలగించి చదును చేస్తే, మచిలీపట్నం పోర్టులో డ్రెడ్జింగ్‌ ద్వారా వచ్చిన మట్టితో రానున్న రోజుల్లో మెరక చేసేందుకు అవకాశం ఉంటుంది.

వ్యవసాయ పరిశోధనాక్షేత్రాన్ని గాలికొదిలేశారు..

సముద్ర తీర ప్రాంతాల్లోని చౌడు శాతం అఽధికంగా ఉన్న భూముల్లో సాగుకు అనుకూలమైన నూతన వరి వంగడాలను కనుగొనడంలో పేరొందిన మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా క్షేతం గత పాలకుల నిర్లక్ష్యానికి తన మనుగడను కోల్పోయింది. మచిలీపట్నం రాడార్‌ కేంద్రం సమీపంలో అన్ని హంగులతో 25 ఏళ్లకుపైగా కొనసాగిన మచిలీపట్నం వ్యవసాయ పరిశోఽధనా క్షేత్రానికి చెందిన 26 ఎకరాలను మచిలీపట్నం మెడికల్‌ కళాశాల నిర్మాణం కోసం తీసుకున్నారు. ఈ భూమికి బదులుగా మచిలీపట్నం మండలం రుద్రవరంలో కృష్ణా యూనివర్సిటీ పక్కనే 16.34 ఎకరాల భూమిని వ్యవసాయ పరిశోధనా క్షేత్రానికి కేటాయించారు. ఈ వ్యవసాయ క్షే త్రానికి భూమిని అధికారికంగా అప్పగించేందుకు పంపిన ఫైలు గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్‌లోనే ఉండిపోయింది. భూమిని అధికారికంగా అప్పగించినట్లుగా ఉత్తర్వులు జారీ అయితేనే వ్యవసాయ క్షేత్రానికి నిఽధులు విడుదల కావడంతో పాటు, భవనాల నిర్మాణం ఇతరత్రా సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

కనీస సౌకర్యాలు కరువు

మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా క్షేత్రానికి కేటాయించిన భూమికి సాగు నీటిని అందించేందుకు పంట కాల్వ, మురుగు బయటకు పోయేందుకు డ్రెయినే జీ పూర్తిస్థాయిలో లేవు. రుద్రవరం గ్రామ పరిధిలోని సాగు భూములకు సాగునీటిని అందించే కొత్తిమీరకోడు పంట కాల్వ నుంచి ఈ క్షేత్రంలోని భూముల వరకు గతంలో చిన్నపాటి పంట కాల్వను తవ్వారు. అయినా ఫలితం లేకుండా పోయింది. వ్యవసాయ పరిశోఽధనాక్షేత్రంలో భవనాల నిర్మాణం, గోడౌన్‌, చుట్టూ ప్రహరీ తదితర నిర్మాణాలు చేసేందుకు రూ.5.80 కోట్ల అంచనాలు రూపొందించి నివేదికను ప్రభుత్వానికి పంపారు. ఈ ఫైలు ఎక్కడుందో, ఎవ్వరికీ తెలియని పరిస్థితి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన డీఆర్‌సీ, జిల్లాపరిషత, జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో పరిశోధనా క్షేత్రానికి నిధులు విడుదల చేయిస్తామని, సాగునీటి సౌకర్యం కోసం ప్రధాన పంట కాల్వ నుంచి ప్రత్యేక పైప్‌లైన్‌ వేస్తామని హామీలు ఇచ్చారు. ఈ ప్రతిపాదనలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ వ్యవసాయ పరిశోధనా క్షేత్రం ఫైలుకు పట్టిన బూజును కూటమి ప్రభుత్వమైనా దులిపి నిధులు మంజూరు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు కోరుతున్నారు.

Updated Date - May 04 , 2026 | 01:22 AM