ఆ నాయకుడి దర్జా చూడతరమా?
ABN , Publish Date - Apr 15 , 2026 | 12:19 AM
ఆయన మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రధాన అనుచరుడు. మంత్రాలయం వైసీపీ మండల అధ్యక్షుడు, గ్రామ సర్పంచ. ఈ హోదాలు చాలు..
ప్రభుత్వ సొమ్ముతో ఇంటికి సీసీ రోడ్డు వేసుకున్న వైసీపీ మండలాధ్యక్షుడు
ఏకంగా పొలాల్లో రోడ్డు నిర్మాణం
పంచాయతీ తీర్మానం మేరకే రోడ్డు వేయించామంటున్న అధికారులు
మంత్రాలయం, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): ఆయన మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రధాన అనుచరుడు. మంత్రాలయం వైసీపీ మండల అధ్యక్షుడు, గ్రామ సర్పంచ. ఈ హోదాలు చాలు.. ఇంతకంటే ఏం కావాలి? ప్రభుత్వ సొమ్ముతో దర్జాలు వెలగబెట్టడానికి. ఆయన పేరు గుర్రెడ్డి భీమిరెడ్డి. తన సొంత గ్రామమైన 52-బసాపురంలోని ఇంటికి ప్రభుత్వ సొమ్ముతో సీసీ రోడ్డు నిర్మించుకున్నాడు. అక్కడ పొల్లాలు తప్ప ఇళ్లు లేవు. అయినా 330 మీటర్ల పొడవుతో 3.75 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మించుకున్నాడు. ఎనఆర్‌ఈజీఎ్‌స రూ. 22 లక్షల నిధులు మంజూరు చేయించుకుని పంచాయతీ సర్పంచు, గ్రామ కార్యదర్శి తీర్మానంతో పనులు చేపట్టాడు. ఈ ఖర్చుతో ప్రజలకు ఉపయోగ పడేచోట రోడ్డు నిర్మించి ఉండవచ్చు. కానీ సదరు నాయకుడు తన సౌకర్యం చూసుకున్నాడు. విచ్చలవిడిగా పంచాయతీ నిధులు ఖర్చు చేయించాడు. అదీ సర్పంచు పదవీకాలం ఒక రోజులో ముగుస్తుందనగా ఈనెల 1, 2 తేదీల్లో కోసిగి మండలం జంపాపురానికి చెందిన వైసీపీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు, కాంట్రాక్టర్ బసిరెడ్డి అనే వ్యక్తితో రోడ్డు నిర్మాణం పూర్తి చేయించాడు. మాధవరం, తుంగభద్ర రైల్వేస్టేషన ప్రధాన రోడ్డుకు తన ఇంటికి దగ్గర కావడంతో ఈ రోడ్డు నిర్మించుకున్నాడు. గతంలో తన ఇంటి నుంచి ఊరు చుట్టేసుకుని ప్రధాన రోడ్డుకు చేరుకోవాల్సిన పరిస్థితి ఉండేది. గ్రామంలో ప్రధాన రోడ్డు, బోయగేరి, మొరేవారిగేరి, ఎస్సీ కాలనీలోని మొదటిలైను, గ్రామ చావిడి, సాయిబాబా నగర్ కాలనీలో బోయ మేకల కర్రెన్న లైను, బోయ భవంతుడు లైను, కుమ్మరి నాగరాజు ఇంటిలైను, కుమ్మరి హనుమంతప్ప ఇంటికి రోడ్లు లేక అవస్థలు పడుతున్నారు. ప్రజలు నివశించే ఈ ప్రాంతాల్లో సీసీ రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. సర్పంచ పంచాయతీ అధికారులతో తీర్మానం చేయించి దర్జాగా తన ఇంటికి సీసీ రోడ్డు వేయించుకున్నాడు. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు కావడంతో అక్కడ ఆయన చెప్పిందే వేదం. ఎవరు నోరెత్తినా, వ్యతిరేకించినా తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుంది. అధికారులు అడ్డుచెప్పినా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. పంచాయితీ తీర్మానం ఉంది కదా అని వైసీపీ నాయకుడు సూచించిన చోటునే రోడ్డు నిర్మించామని అధికారులు పేర్కొంటున్నారు. గత ఏడాది రూ.5లక్షలతో ఎనఆర్‌ఈజీఎ్‌స నిధులతో 120 మీటర్లు సీసీ రోడ్డు నిర్మించారు. తమ సర్పంచు కాలపరిమితి ముగుస్తుందని, ప్రత్యేక అధికారుల పాలన వస్తుందన్న ముందు జాగ్రత్తతో ఈ పని పూర్తి చేయించుకున్నాడు.
ఫ పంచాయతీ తీర్మానంతోనే ః మల్లయ్య, ఏఈఈ, పంచాయతీరాజ్, మంత్రాలయం
గతంలో సర్పంచు రాఘవరెడ్డి, అప్పటి గ్రామ కార్యదర్శి రాజేష్ ఈ రోడ్డు నిర్మాణానికి పంచాయతీ తీర్మానం చేశారు. దాని ప్రకారమే నాణ్యత, ప్రమాణాలతో రోడ్డును నిర్మించాం. పొలాల మధ్యన ఈ రోడ్డుకు ఇరువైపులా ఎటువంటి గృహాలు లేవు. నేను ప్రత్యేక అధికారిగా ఈ గ్రామంలో పనిచేస్తున్నాను. అదనంగా మంత్రాలయం, పెద్దకడబూరు మండలాలకు ఏఈగా ఉన్నాను. ఈ ఒత్తిడి తో ఆరోగ్యం సహకరించక సెలవుల్లో వెళ్లాలని నిర్ణయించుకున్నాను.