ఇప్పుడు కుదరదు.. సోమవారం రండి
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:42 PM
వైద్యో నారాయణో హరి అని అంటారు.
రోగిని వెనక్కి పంపిన ఆర్థో విభాగం వైద్యులు
కట్టు కట్టాలని ప్రాధేయపడినా చీదరించుకున్న సిబ్బంది
వైద్యో నారాయణో హరి అని అంటారు. వైద్యులను దేవుడితో సమానంగా పోలుస్తారు. అలాంటి వైద్యులే రోగులతో కఠినంగా వ్యహరిస్తున్నారు. అష్టకష్టాలు పడి సర్వజన వైద్యశాలకు వచ్చే పేద రోగులను నిర్లక్ష్యం చేస్తున్నారు. వైద్య పట్టా పొందేటప్పుడు చేసిన ప్రతిజ్ఞను విస్మరిస్తున్నారు. దూర ప్రాంతం నుంచి ఎంతో బాధతో వచ్చిన రోగిని చూసేందుకు వీలుకుండా వీరికి లేకుండా పోయింది. కనీసం రోగిని బాధను అర్ధం చేసుకోకుండా ఇప్పుడు కుదరదు.. సోమవారం అంటూ వెనక్కి పంపిస్తున్న ఘటన కర్నూలు సర్వజన వైద్యశాల చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలు ఇక్కడ నిత్యం జరుగుతున్నా పట్టించుకునే ఉన్నతాధికారులు నిద్రావస్థలో ఉన్నారు.
కర్నూలు హాస్పిటల్, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ఇప్పుడు కుదరదు.. సోమవారం రండి అంటూ ఆర్థో విభాగం వైద్యులు వ్యవహరించిన తీరు దుమారం రేపింది. కొన్ని రోజుల క్రితం పుల్లూరుకు చెందిన 19ఏళ్ల లక్ష్మణ్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి తీవ్ర రక్తస్రావంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చాడు. కుడి కాలు తీవ్రంగా గాయమైంది. అడ్మిట్ అయి చికిత్స పొంది వెళ్లిపోయాడు.శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో రోగిని ఆటోలో బంధువులు తీసుకొచ్చారు. ఆర్థో విభాగం ఓపీ నెంబర్ 6 లో ఉన్న వైద్యులు ఇప్పుడు చూడటం కుదరదని సోమవారం రమ్మని చెప్పి వెనక్కు పంపారు.
బలవంతంగా పంపించేశారు
కట్టు కట్టాలని ప్రాధేయ పడినా అక్కడి సిబ్బంది చీదరించుకున్నారు. క్యాజువాలిటీ వద్ద ఉన్న రోగిని సిబ్బంది బలవంతంగా పంపించేశారు. మరో పక్క ఆస్పత్రి అధికార్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు అన్ని విభాగాల్లో ఓపీల్లో వైద్యులు ఉండాలని సూచించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆదేశాలు జారీ చేసినా ఇవి ఇక్కడ అమలు కావడం లేదని రోగులు మండిపడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఓపీ విభాగాల్లో పీజీలను పెట్టి వైద్యులు వెళ్లిపోతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. పీజీలు తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తుండటంతో సుదూర ప్రాంతాల రోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.