Bharathi Cements: ‘రద్దు’పై రచ్చకు రెడీ..!
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:08 AM
చంద్రబాబు దెబ్బకు భారతీ సిమెంట్స్ పారిపోతోందట! సజ్జన్ జిందాల్, అరబిందో, షిరిడీ సాయి, మైహోమ్, దాల్మియా, శ్రీసిమెంట్స్ వంటి పరిశ్రమల యాజమాన్యాలు పారిపోతున్నాయట!
భారతీ సిమెంట్స్ పారిపోతోందంటూ ప్రకటన
జగన్ ముందస్తు బ్లాక్ మెయిలింగ్‌లో భాగం
కడప జిల్లాలో 752 ఎకరాల సున్నపురాయి లీజు
కేంద్ర చట్టాలు, హైకోర్టు తీర్పుల ఉల్లంఘన
తీర్పును వక్రీకరిస్తూ ఎన్నికల ముందు పునరుద్ధరణ
భారతీ సిమెంట్స్‌కు ప్రభుత్వం నోటీసులు జారీ
జవాబివ్వలేక మౌనంగా ఉన్న యాజమాన్యం
అందులో భాగమే ‘పారిపోతున్నారు’ ప్రకటన
భారతీ సిమెంట్స్... జగన్ కుటుంబ సంస్థ. అధికారంలో ఉండగా అడ్డగోలుగా ‘మేళ్లు’ చేసుకున్నారు. 2024 ఎన్నికల ముందే 50 ఏళ్లపాటు 752 ఎకరాల గనులు భారతీ సిమెంట్స్‌కు ఇచ్చేశారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ తతంగంపై కేంద్ర ఆదేశాల మేరకు కూటమి సర్కారు చర్యలు చేపట్టింది. నోటీసులిచ్చింది. అంతే... ‘భారతీ సిమెంట్స్‌ను తరిమేస్తున్నారు’ అంటూ జగన్ వ్యూహాత్మకంగా ముందస్తు రచ్చ మొదలుపెట్టారు.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
చంద్రబాబు దెబ్బకు భారతీ సిమెంట్స్ పారిపోతోందట! సజ్జన్ జిందాల్, అరబిందో, షిరిడీ సాయి, మైహోమ్, దాల్మియా, శ్రీసిమెంట్స్ వంటి పరిశ్రమల యాజమాన్యాలు పారిపోతున్నాయట! ఇది... మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉవాచ! ఔనా... పారిశ్రామికవేత్తలకు ఎర్రతివాచీ పరచడం మాత్రమే తెలిసిన కూటమి సర్కారుకు, వారిని బెదరగొట్టి తరిమేయడమూ తెలుసా!? అని ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘భారతీ సిమెంట్స్ పారిపోతోంది’ అంటూ, ఇతర కంపెనీల పేర్లనూ ప్రస్తావించడం వెనుక భారీ వ్యూ హమే ఉన్నట్లు తెలుస్తోంది. తాను ముఖ్యమంత్రిగా ఉండగా తన కుటుంబానికే చెందిన భారతీ సిమెంట్స్‌కు అడ్డగోలుగా మేళ్లు చేసుకున్న జగన్... ఇప్పుడు కూటమి ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోకుండా ముందస్తు ‘బ్లాక్ మెయిలింగ్’కు దిగినట్లుగా అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే... వైఎస్ హ యాంలో రఘురాం సిమెంట్స్‌కు కడప జిల్లాలో 752 ఎకరాల్లో సున్నపురాయి లీజులు కేటాయించారు.
ఆ తర్వాత... అది ‘భారతీ సిమెంట్స్’గా మారింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వంతో ఒప్పందం కుదరనప్పటికీ... మైనింగ్ లీజులనూ భారతీ సిమెంట్స్‌కు బదలాయించేశారు. ఇదో... ఉల్లంఘన. ఇక... 2015లో కేంద ప్రభుత్వం గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ (ఎంఎండీఆర్) చట్టాన్ని సవరించింది. ఈ చట్టానికి లోబడని మైనింగ్ లీజులను రద్దు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు పంపింది. ఆ మేరకు... 2016లో భారతీ సిమెంట్స్ సహా అనేక కంపెనీలకు నోటీసులు వెళ్లాయి. 45 రోజుల్లోపు సమాధానం చెప్పాలని అందులో స్పష్టం చేసినా... భారతీ సిమెంట్స్ పట్టించుకోలేదు. దీంతో... 2018లో భారతీ సిమెంట్స్‌కు ఇచ్చిన సున్నపురాయి లీజులను రద్దు చేశారు. దీనిపై జగన్ (భారతీ సిమెంట్స్ యాజమాన్యం) కేంద్రం వద్ద చేసుకున్న ప్రయత్నాలు ఫలించలేదు.
2021లో హైకోర్టును ఆశ్రయించారు. ‘‘మీరు రాష్ట్ర ప్రభుత్వాన్నే ఆశ్రయించండి. ప్రభుత్వమూ భారతీ సిమెంట్స్ వాదనలు వినాలి’’ అని 2023లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అప్పుడు ‘ప్రభుత్వం’ అంటే... జగనే! ఇంకేముంది... అన్నీ ఆయనకు అనుకూలంగా మార్చుకున్నారు. డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రిటైర్డ్ న్యాయమూర్తి చేత లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ‘వాదనలు వినండి’ అని మాత్రమే హైకోర్టు చెప్పగా... ‘లీజులు ఇచ్చేయండి’ అన్నట్లుగా వక్రీకరించి, భారతీ సిమెంట్స్‌కు సున్నపురాయి లీజులు పునరుద్ధరించుకున్నారు. అది కూడా ఒకేసారి 50 ఏళ్లకు! ఇదం తా... మరికొన్ని నెలల్లో జగన్ ‘మాజీ’ అవుతారనగా జరిగిన పరిణామం. కేంద్ర మైనింగ్ చట్టాలకు, కోర్టు తీర్పులకు, ఇతర నిబంధనలకు విరుద్ధంగా లీజుల పునరుద్ధరణ జరగడంతో... కూటమి ప్రభుత్వం భారతీ సిమెంట్స్‌తోపాటు మరో రెండు కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. 14 రోజుల్లో స్పందించాలంటూ గత నెలలో (2025 డిసెంబరు) నోటీసులు ఇవ్వగా... భారతీ సిమెంట్స్ ఇప్పటిదాకా స్పందించలేదు. నిబంధనల ప్రకారం 45 రోజులు వేచి చూసి... ఈ మైనింగ్ లీజులను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.
‘రద్దు చేస్తే’ రచ్చ చేయాలని...
మైనింగ్ లీజుల్లో ఉల్లంఘనలు గుర్తించినప్పుడు నోటీసులు జారీ చేయడం సర్వసాధారణం. ఆయా కంపెనీలు ఇచ్చిన సమాధానం ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటాయి. ఈ విషయం జగన్‌కూ తెలుసు. అయితే... ప్రభుత్వం జారీ చేసిన నోటీసులకు సంతృప్తికరమైన సమాధానం భారతీ సిమెంట్స్ వద్ద కూడా లేదు. అంటే... చట్ట ప్రకారం లీజులు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నట్లే! దీనినే రాజకీయంగా ఉపయోగించుకునేందుకు జగన్ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం భారతీ సిమెంట్స్ గనుల లీజు రద్దు చేస్తే... దీనిని కక్షసాధింపు చర్యగా అభివర్ణిస్తూ జనంలోకి వెళ్లడం ఒక ఆలోచన. అలాగే... కూటమి ప్రభుత్వం పరిశ్రమలను తరిమేస్తోందని జాతీయ స్థాయిలో వివాదాస్పదం చేయాలన్నది మరో వ్యూహం! ఇందులో భాగంగానే... తమ సొంత కంపెనీతోపాటు మరికొన్ని సంస్థల పేర్లనూ ప్రస్తావించి ‘చంద్రబాబు బెదిరింపులకు పారిపోతున్నాయి’ అని జగన్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. సజ్జన్ జిందాల్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ముంబై నటి కేసులో ఆయన తీరు వివాదాస్పదమైంది. ఇక... జగన్ హయాంలో బాగా లబ్ధి పొందిన మరో సంస్థ ‘షిరిడీ సాయి’. వాళ్లు ఇప్పటికీ రాష్ట్రంలో చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. తెలంగాణ పారిశ్రామికవేత్త రామేశ్వరరావు ‘మై హోం సిమెంట్స్’ ఏపీని వీడుతున్నట్లు ఎక్కడా చెప్పలేదు. అయినప్పటికీ... ఆయా కంపెనీల పేర్లనూ జగన్ ప్రస్తావించారు.