విదేశీ నిపుణుల ఆఖరి సమీక్ష!
ABN , Publish Date - May 27 , 2026 | 05:43 AM
పోలవరం ప్రాజెక్టు తొలిదశను వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి పూర్తిచేసి ప్రధాని మోదీతో ప్రారంభించేందుకు రాష్ట్రప్రభుత్వం సమాయత్తమవుత్ను తరుణంలో..
నేడు పోలవరానికి కెనడా బృందం
ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులు, డిజైన్లపై చర్చ
అమెరికా నిపుణుల సేవల ఉపసంహరణకు కేంద్ర జలసంఘం నిర్ణయం
అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు తొలిదశను వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి పూర్తిచేసి ప్రధాని మోదీతో ప్రారంభించేందుకు రాష్ట్రప్రభుత్వం సమాయత్తమవుత్ను తరుణంలో.. ప్రధాన డ్యాం పనులపై సమీక్షించేందుకు విదేశీ నిపుణులు మరోసారి వస్తున్నారు. కెనడాకు చెందిన సీన్ హించ్‌బెర్గర్, రిచర్డ్ డొనెల్లీ మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. బుధవారం ఉదయం పది గంటలకు రాజమహేంద్రవరంలో దిగి.. పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్తారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), వాప్కోస్, సీఎస్ఎంఆర్‌ఎస్, నిర్మాణ సంస్థ, రాష్ట్ర జల వనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ప్రధాన ప్రాజెక్టు ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం నిర్మాణ పనులను తనిఖీ చేస్తారు. మర్నాడు ఈసీఆర్‌ఎఫ్ డ్యాం డిజైన్లపై సమగ్రంగా సమీక్ష జరిపి ఈ డ్యాంతో పాటు ఇతర పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఈసీఆర్‌ఎఫ్ డ్యాం కూడా పూర్తికానుండడంతో కెనడా నిపుణుల బృందానికి ఇదే ఆఖరి సమీక్ష కావచ్చని తెలుస్తోంది. ఇంకోవైపు.. డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తికావడం.. దానిపై ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈపీఆర్‌ఎఫ్) డ్యాం నిర్మాణం శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో కెనడా నిపుణుల సేవలు మాత్రం వాడుకుంటూ.. అమెరికా నిపుణులు డేవిడ్ బి.పాల్, జియాన్ ఫ్రాంకో డి సిక్కోల సేవలను ఉపసంహరించుకోవాలని కేంద్ర జలసంఘం నిర్ణయించింది. వాస్తవానికి టీడీపీ హయాంలో 2018నాటికే డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయింది. దానిపై వెంటనే ఈసీఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైనా..
కేంద్ర జలసంఘం నుంచి డిజైన్లకు ఆమోదం రాలేదు. ఈలోపు 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచి జగన్ సీఎం అయ్యారు. ఆయన ప్రాజెక్టు పనులను ఆపేశారు. 2020లో గోదావరికి భారీ వరద రావడం.. 14 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో డయాఫ్రం వాల్ మీదుగా ప్రవహించడంతో అది దెబ్బతింది. జల సంఘం పై విదేశీ నిపుణులతో అధ్యయనం చేయించగా డయాఫ్రం వాల్‌ను కొత్తగా నిర్మించాల్సిందేనని వారు తేల్చిచెప్పారు. 2024లో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టడంతో పోలవరం పనులు ఊపందుకున్నాయి. గతంలో డయాఫ్రం వాల్ నిర్మించిన జర్మనీకి చెందిన బావర్ సంస్థకే కేంద్రం బాధ్యతలు అప్పగించింది. ఆ సంస్థ కొత్త వాల్ పనులను 2026 ఏప్రిల్ రెండో తేదీకల్లా పూర్తి చేసింది. దరిమిలా డయాఫ్రం వాల్ నిర్మాణంలో అనుభవం కలిగిన డేవిడ్ బి.పాల్, గిమాన్ ఫ్రాన్స్‌కో డికాకో సేవలను ఇక ఉపసంహరించుకుని.. ఈసీఆర్‌ఎఫ్, ఇతరత్రా పనుల్లో నైపుణ్యం ఉన్న హించ్‌బెర్గర్, రిచర్డ్ డొనెల్లీల సేవలను కొనసాగించాలని జలసంఘం నిర్ణయించింది. దీంతో బుధ, గురువారాల్లో వీరి పర్యటన చివరిది కావచ్చని రాష్ట్ర జలవనరుల శాఖ వర్గాలు భావిస్తున్నాయి.