Indigenous Tourism: స్వదేశీ టూరిజాన్ని ప్రోత్సహించండి
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:46 AM
స్వదేశీ టూరిజాన్ని ప్రోత్సహించాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
లైట్‌హౌస్ ఫెస్టివల్ ప్రారంభ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు
ఏపీలో 110 ప్రాజెక్టులకు 1.14 లక్షల కోట్లు: కేంద్ర మంత్రి సర్బానంద
విశాఖపట్నం, జనవరి 9(ఆంధ్రజ్యోతి): స్వదేశీ టూరిజాన్ని ప్రోత్సహించాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. పోర్టులు, షిప్పింగ్, జల వనరుల శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఎంజీఎం పార్కు మైదానంలో నిర్వహిస్తున్న లైట్‌హౌస్ ఫెస్టివల్‌ను శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, దేశంలో అనేక అద్భుతమైన నగరాలు, సుందరమైన ప్రదేశాలు, ప్రాంతాలు ఉన్నాయని, వాటిని ఆస్వాదించాలని కోరారు. అమెరికాకు వైట్ హౌస్ ఉంటే, మనకు 200కుపైగా లైట్‌హౌస్‌లు ఉన్నాయని చెప్పారు. అతిథిగా హాజరైన కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జల రవాణా శాఖా మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ గడిచిన 11 ఏళ్లలో లైట్‌హౌస్ టూరిజం 500 శాతం అభివృద్ధి చెందిందని తెలిపారు. దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు. సాగరమాల పథకంలో భాగంగా ఏపీలో 110 ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు రూ.1.14 లక్షల కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపారు.