Share News

బెంచీలు కొన్నారు.. పిల్లలు నేలపైనే కూర్చున్నారు!

ABN , Publish Date - Mar 07 , 2026 | 06:21 AM

‘ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం.. అద్భుతంగా రంగులేసి అదరగొట్టాం..’ అని ప్రచారం చేసుకున్న జగన్‌ పాలనలో నాడు-నేడు పథకం అమలు తీరును కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) తీవ్రంగా దుయ్యబట్టింది.

బెంచీలు కొన్నారు.. పిల్లలు నేలపైనే కూర్చున్నారు!

  • ప్రమాణాల కంటే తక్కువ స్థాయి ఫ్యాన్లు పెట్టారు

  • నామినేషన్‌ విధానంలో ‘ఎస్‌టీఎంఎస్‌’ కాంట్రాక్టు

  • జగన్‌ హయాంలో ‘నాడు-నేడు’పై కాగ్‌ నివేదిక

అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం.. అద్భుతంగా రంగులేసి అదరగొట్టాం..’ అని ప్రచారం చేసుకున్న జగన్‌ పాలనలో నాడు-నేడు పథకం అమలు తీరును కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) తీవ్రంగా దుయ్యబట్టింది. పథకం అమలులో అనేక లోపాలను గుర్తించింది. బెంచీలు కొనుగోలు చేసినా పిల్లలు నేలపైనే కూర్చున్నారని, ఎక్కువ ప్రమాణాలు చూపించి తక్కువ ప్రమాణాల ఫ్యాన్లు బిగించారని స్పష్టం చేసింది. అవసరానికి మించి ఇండెంట్‌ పెట్టిన అధికారులను బాధ్యులను చేయాలని సిఫారసు చేసింది. వైసీపీ హయాంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను కాగ్‌ విడుదల చేసింది. దీనిలో గుర్తించిన లోపాలు, ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పులపై కాగ్‌ కీలక విషయాలు వెల్లడించింది.


  • నాడు-నేడు పథకం కింద రిపేర్లు, రంగులు వేయడం, బల్లలు, ఫ్యాన్లు, ఇంటరాక్టివ్‌ ప్యానెళ్లు, స్మార్ట్‌ టీవీలను కొనుగోలు చేశారు. వీటిని రెవెన్యూ వ్యయానికి బదులుగా, మూలధన వ్యయం కింద చూపించారు.

  • స్కూల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(ఎస్‌టీఎంఎస్‌) టెక్నాలజీ అమలుకు సంబంధించిన ఏజెన్సీ ఎంపికను నామినేషన్‌ ప్రాతిపదికన చేశారు. వాస్తవానికి టెండర్ల ద్వారా చేయాలి. నామినేషన్‌ విధానంలో కాకుండా పోటీతత్వ, పారదర్శక ప్రక్రియను అనుసరించాలి. కానీ, అలా చేయలేదు.

  • నాణ్యతా ప్రమాణాల నిర్ధారణకు 157 ఫ్యాన్లను పరిశీలించగా, వాటిలో 71 ఫ్యాన్లు(45.22శాతం) నిర్దేశిత ప్రామాణికం కంటే 210 తక్కువ సీఎంఎం(ప్రతి నిమిషానికి ఘనపు మీటర్లు) కలిగి ఉన్నాయి. మరో 220 ఫ్యాన్లను పరిశీలిం చగా 67 ఫ్యాన్లలో 380 కంటే తక్కువ ఆర్‌పీఎం కలిగి ఉన్నాయి.

  • మౌలిక సదుపాయాలపై 108పాఠశాలలను పరి శీలించగా 33(31శాతం) గ్రీన్‌చాక్‌ బోర్డులు నిరు పయోగంగా కనిపించాయి.రూ.76.8లక్షలతో ఏర్పా టుచేసిన తాగునీటివ్యవస్థ పనిచేయడం లేదు.

  • డ్యూయెల్‌ డెస్క్‌ల కోసం రూ.383.51 కోట్లు ఖర్చు చేశారు. 108 పాఠశాలలను పరిశీలిస్తే 32 పాఠశాలల్లో 1,973 మంది విద్యార్థులు నేలపైనే కూర్చున్నారు.

  • వస్తువుల కొనుగోలుకు ఇండెంట్‌ పెట్టే ముందు పాఠశాలల్లో వాస్తవ అవసరాన్ని నిర్ధారించే వ్యవస్థను ప్రభుత్వం రూపొందించాలి. అవసరాలకు మించి ఇండెంట్‌ పెట్టిన అధికారులను ప్రభుత్వం బాధ్యులను చేయాలి.


విద్యుత్తు రంగం అస్తవ్యస్తం

రాష్ట్ర విద్యుత్తు రంగాన్ని వైసీపీ హయాంలో అస్తవ్యస్తం చేశారని కాగ్‌ అక్షింతలు వేసింది. నిర్వహణ లోపాలతో విద్యుత్తు సంస్థలను నష్టాలపాలు చేశారని పేర్కొంది. 2022-23లో ఐదు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు కలిపి మొత్తం రూ.1,251.63 కోట్ల నష్టాన్ని చవిచూడగా, ఇందు లో రూ.1,227.55 కోట్ల (98.07ు) నష్టం కేవలం ఏపీ విద్యుత్తు అభివృద్ధి కంపెనీ లిమిటెడ్‌ ద్వారానే వచ్చిందని కాగ్‌ నివేదిక పేర్కొంది. మూడు విద్యుత్తు పంపిణీ సంస్థలు రూ.29,544.74 కోట్లు, విద్యుత్తు అభివృద్ధి కంపెనీ రూ.3,863.65 కోట్లు నష్టాలు నమోదు చేశాయని వివరించింది. ఈ సంస్థల ఆస్తుల నికర విలువలూ ప్రతికూలంగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. కంపెనీల బోర్డులో తప్పనిసరిగా ఒక మహిళా డైరెక్టర్‌ ఉండాలన్న నిబంధనను ఏపీ విద్యుత్తు అభివృద్ధి కంపెనీ లిమిటెడ్‌, విద్యుత్తు ఉత్పత్తి కార్పొరేషన్‌ లిమిటెడ్‌, విద్యుత్తు ఆర్థిక కార్పొరేషన్‌ లిమిటెడ్‌, విద్యుత్తు ప్రసార కార్పొరేషన్‌ లిమిటెడ్‌ తుంగలో తొక్కాయని కాగ్‌ ఆరోపించింది. 2022-23 మధ్య ఈ సంస్థల్లో ఒక్క మహిళా డైరెక్టర్‌ కూడా లేరని స్పష్టం చేసింది.

Updated Date - Mar 07 , 2026 | 06:25 AM