Share News

ఆత్మకూరులో కేబుల్‌ వార్‌..!

ABN , Publish Date - Mar 11 , 2026 | 11:32 PM

ఆత్మకూరు ప్రాంతంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన కేబుల్‌ పంచాయతీ కొద్దిరోజులుగా పోలీసులకు తలనొప్పిగా మారింది.

         ఆత్మకూరులో కేబుల్‌ వార్‌..!

పోలీసు అధికారిపైనే చేయి చేసుకున్న యువకుడు..?

ఆత్మకూరు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు ప్రాంతంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన కేబుల్‌ పంచాయతీ కొద్దిరోజులుగా పోలీసులకు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి పట్టణంలోని ఏకలవ్యనగర్‌లో కేబుల్‌ తీగలు కత్తిరించారన్న వివాదం పోలీసుస్టేషనకు చేరింది. దీంతో ఇరువర్గాలను పోలీసులు పోలీసుస్టేషనకు పిలిపించి విచారించారు. ఈక్రమంలోనే సహనం కోల్పోయిన ఓ పోలీసు అక్కడే ఉన్న యువకుడిని బండబూతులతో ఆగ్రహించినట్లు సమాచారం. రెచ్చగొట్టే వ్యాక్యలతో ఆగ్రహం చెందిన ఆ యువకుడు సైతం సదరు పోలీసుపై చేయి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు కూడా ఆ యువకుడికి తమదైన శైలిలో ట్రీట్‌మెంట్‌ ఇచ్చినట్లు సమాచారం. కాగా ఈ వ్యవహారంలో ఇద్దరి వైపు తప్పులు ఉన్నట్లు తెలిసింది. కేబుల్‌ పంచాయతీ విషయంపై పోలీసుస్టేషనకు వచ్చిన వారిని చట్టపరంగా విచారించి కేసులు నమోదు చేయాల్సి ఉండగా పత్రికల్లో రాయలేని విధంగా బూతులు మాట్లాడటం వల్లే ఈ వివాదం తలెత్తిందని పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సంఘటన పోలీసు వర్గాలకు అవమానకరంగా మారిందని చెప్పవచ్చు. ఇదిలావుంటే ఆ యువకుడి వర్గం వారు కూడా విషయాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మొత్తానికి ఈ సమస్యను రాజీ చేసేందుకు రాజకీయ నాయకులు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇప్పటికీ ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయడం గమనార్హం.

Updated Date - Mar 11 , 2026 | 11:32 PM