మహిళా బిల్లుతో డీలిమిటేషన్‌ను ముడిపెట్టొద్దు: రాఘవులు
ABN , Publish Date - Aug 07 , 2026 | 04:46 AM
మహిళా బిల్లుతో డీలిమిటేషన్‌ను ముడిపెట్టవద్దని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): మహిళా బిల్లుతో డీలిమిటేషన్‌ను ముడిపెట్టవద్దని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంటు సమావేశాల్లో ఆ రెండు బిల్లులను వేర్వేరుగా ప్రవేశపెడితే మహిళా బిల్లును ఆమోదించడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఆ రెండు బిల్లులను కలిపి పెట్టడం ద్వారా ప్రతిపక్షాలు మహిళా బిల్లును అడ్డుకుంటున్నాయనే తప్పుడు ప్రచారంతో బీజేపీ రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాఘవులు రాసిన ‘కుల నిర్మూలన-మార్క్సిస్టు దృక్పథం’ పుస్తకాన్ని గురువారం విజయవాడలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ ప్రతిపక్షాలతో చర్చించిన తర్వాతే డీలిమిటేషన్ బిల్లుపై ముందుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్‌పై ఆందోళనకు దిగిన విద్యార్థులపై నిర్భంద చర్యలను మానుకోవాలని హితవు పలికారు.