ఉపదేశాలు కాదు...ఉపశమనం కల్పించాలి
ABN , Publish Date - May 15 , 2026 | 04:41 AM
‘ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోకుండా ఉపదేశాలతో తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు.
ప్రధాని మోదీపై బీవీ రాఘవులు ధ్వజం
విశాఖపట్నం, మే 14(ఆంధ్రజ్యోతి): ‘ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోకుండా ఉపదేశాలతో తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ప్రధాని మాటలను చూస్తుంటే గ్యాస్, పెట్రో, డీజిల్ ధరలు పెంచుతామని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నట్టు అర్థమవుతుంది. ధరలు పెరగకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాల్సిన తరుణంలో స్వామీజీల మాదిరి ఉపదేశాలు ఇస్తే సమస్యలు పరిష్కారం కావనే విషయం తెలుసుకోవాలి. బంగారం ఏడాదిపాటు కొనొద్దని చెప్పిన మోదీ.... బంగారం పనులపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కార్మికుల కుటుంబాలు ఏమైపోతాయో ఆలోచించడం లేదు. ట్రంప్‌నకు ప్రధాని మోదీ దాసోహమనడం మానేసి, భారతదేశ గౌరవం పెరిగేలా వ్యవహరించాలి. నీట్ పరీక్ష రద్దు కావడంతో నష్టపోయిన విద్యార్థులకు పరిహారం చెల్లించాలి. సీఎం చంద్రబాబు తక్షణం జోక్యం చేసుకుని సింహాచలం దేవస్థానం పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించాలి. స్టీల్‌ప్లాంటుకు సొంత గనులు కేటాయింపు కోసం ప్రధాని మోదీపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒత్తిడితేవాలి’ అని రాఘవులు డిమాండ్ చేశారు.