పల్లె పీఠాల కోసం గ్రామాల్లో సందడి
ABN , Publish Date - Nov 14 , 2026 | 11:37 PM
గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది.
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
ముహూర్తాల కోసం పండితులను కలుస్తున్న
సర్పంచ్ అభ్యర్థులు
ఈనెల 26న 108 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు
ఏకగ్రీవాల కోసం కసరత్తు చేస్తున్న టీడీపీ నాయకులు
ఆలూరు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. తొలి విడలో ఆలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, 26న ఎన్నికలు జరగనున్నాయి. నియోజకవర్గ పరిధిలోని ఆలూరు, ఆస్పరి, హాలహర్వి, హొళగుంద, చిప్పగిరి, దేవనకొండ మండలాల్లో మొత్తం 108 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు గ్రామ పంచాయతీల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో టీడీపీ, వైసీపీ, కమ్యూనిస్ట్ పార్టీలు తమ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి ఇప్పటికే గ్రామాల్లో టీడీపీ మద్దతుదారు సర్పంచ్ అభ్యర్థులను ఖరారు చేసి స్థానిక నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
ఏకగ్రీవాల కోసం కసరత్తు
చిన్న పంచాయతీలో ఎన్నికలు లేకుండా గ్రామస్థులతో చర్చించి ఏకగ్రీవాలు చేసేందుకు టీడీపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఆలూరు మండలం అరికెర తండాలో ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే హత్తిబెళగల్‌లో కూడా చర్చలు సాగిస్తున్నారు.
నామినేషన్ ఎప్పుడు వేస్తే బాగుంటుంది..
తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలవడంతో ఆశావహులు ముహూర్తాల వేటలో నిమగ్నమయ్యారు. నామినేషన్ల ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుండడంతో ఏ రోజు ఏ సమయంలో నామినేషన్ వేస్తే శుభప్రదంగా ఉంటుందోనని పురోహితులు, సిద్ధాంతుల వద్ద ఆరా తీస్తున్నారు. ఇంటి నుంచి ఏ సమయంలో బయలుదేరాలి? నామినేషన్ కేంద్రానికి ఎప్పుడు చేరుకోవాలి? పత్రాలు ఏ సమయంలో సమర్పించాలి? అనే విషయాలపై అభ్యర్థులు దృష్టి సారిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు ఈనెల 15, 16, 17వ తేదీల్లో నామినేషన్లు దాఖలు చేయాలి. 15, 16వ తేదీల్లో మంచి ముహూర్తం ఉందని, 17న అష్టమి మంగళవారం కావడంతో ఎవరికీ కలిసిరాదని, ఆరోజు నామినేషన్లకు దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. దీంతో ఆశావహులు ముందుగానే ముహూర్తాలను రాయించుకుని, పార్టీ పెద్దల ఆశీస్సులు పొందే పనిలో పడ్డారు.