బస్సు డ్రైవర్‌కు ఏడు రోజులు జైలు శిక్ష
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:35 PM
మద్యం తాగి బస్సు నడిపి ప్రమాదానికి కారణమైన నెల్లూరు జిల్లాకు చెందిన మార్నింగ్ స్టార్ బస్సు డ్రైవర్ గొట్టిపాటి గోపికి నంద్యాల కోర్టు ఏడు రోజులు జైలు శిక్ష విధించింది.
పాణ్యం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి) : మద్యం తాగి బస్సు నడిపి ప్రమాదానికి కారణమైన నెల్లూరు జిల్లాకు చెందిన మార్నింగ్ స్టార్ బస్సు డ్రైవర్ గొట్టిపాటి గోపికి నంద్యాల కోర్టు ఏడు రోజులు జైలు శిక్ష విధించింది. శుక్రవారం ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 8 వతేదీన హైదరాబాదు నుంచి తిరుపతికి వెళ్తున్న మార్నింగ్‌స్టార్ బస్సు కొత్త చెరువు సమీపంలోని డాబా వద్ద 9వతేదీ ఉదయం 5.30 గంటలకు డ్రైవర్ నర్సయ్య బస్సును నిలిపి టీ తాగాడు. బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. టీ తాగిన అనంతరం నర్సయ్య అప్పటికే మద్యం తాగిఉన్న గోపికి డ్రైవింగ్ బాధ్యత ఇచ్చాడు. బస్సు డాబా నుంచి అర కిలోమీటరు దూరం వెళ్లేలోగా వాహనాన్ని అతివేగంగా, నిర్లక్షంగా నడపడంతో బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న ఇనుప రెయిలింగ్‌ను ఢీకొని నిలిచిపోయింది. బస్సులోని ప్రయాణికులు 112 కు కాల్ చేయడంతో పోలీసు సిబ్బంది వంటనే సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన సహాయంతో ట్రాఫిక్ క్లియర్ చేశారు. డ్రైవర్ గోపిని పోలీసులు బ్రీత ఎనలైజర్‌తో పరీక్షించగా మద్యం తాగినట్లు నిర్ధారణ అయ్యింది. కడపకు చెందిన షేక్ అబ్దుల్‌బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోపిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. బస్సును సీజ్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. నంద్యాల కోర్టు డ్రైవర్ గోపికి ఏడు రోజులు జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. బలమైన రెయిలింగ్‌ను ఢీకొనడంతో బస్సు ఆగిందని లేనిపక్షంలో పక్కనున్న గోతిలో పడి ప్రయాణికులకు ప్రాణాపాయం ఉండేదన్నారు.