Jallikattu: యువకులపైకి దూసుకొచ్చిన కోడెగిత్తలు
ABN , Publish Date - Jan 03 , 2026 | 06:10 AM
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్తశానంబట్ల గ్రామంలో శుక్రవారం ఉత్కంఠభరితంగా జల్లికట్టు (పశువుల పండుగ) జరిగింది.
తిరుపతి జిల్లాలో జల్లికట్టు.. పలువురికి తీవ్రగాయాలు
చంద్రగిరి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్తశానంబట్ల గ్రామంలో శుక్రవారం ఉత్కంఠభరితంగా జల్లికట్టు (పశువుల పండుగ) జరిగింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాలో జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీ. గ్రామంలో ఓ వర్గం జల్లికట్టు వద్దని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం, మరో వర్గం నిర్వహించాలని కోరడంతో ఎట్టకేలకు శుక్రవారం చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో గ్రామంలోని నడివీధిలో పశువులను గుంపులుగా వదిలారు. అప్పటికే పరిసర గ్రామాలకు చెందిన యువత తరలివచ్చి కోడెగిత్తలను నిలువరించి.. వాటి కొమ్ములకు కట్టిన బహుమతులను సొంతం చేసుకొనేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో యువకులపైకి కోడెగిత్తలు దూసుకురావడం.. వాటి కింద పడటంతో 15 మందికిపైగా తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న చంద్రగిరి పీహెచ్‌సీ వైద్య బృందం బాధితులకు చికిత్స చేయగా, మరి కొందరిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.