పరిశ్రమలకు ‘బల్క్ డీజిల్’ షాక్!
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:19 AM
ఇండస్ట్రియల్ డీజిల్ ధర లీటరుపై అమాంతం రూ.22 పెరిగిపోవడంతో రాష్ట్రంలోని పరిశ్రమలకు పెద్ద దెబ్బ తగలనుంది. అసాధారణ ధర పెంపు కారణంగా పరిశ్రమల నిర్వహణ, ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగిపోతుందని...
లీటరుపై అమాంతం రూ.22 పెంపు
నిర్వహణ, ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతుందని ఆందోళన
అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ఇండస్ట్రియల్ డీజిల్ ధర లీటరుపై అమాంతం రూ.22 పెరిగిపోవడంతో రాష్ట్రంలోని పరిశ్రమలకు పెద్ద దెబ్బ తగలనుంది. అసాధారణ ధర పెంపు కారణంగా పరిశ్రమల నిర్వహణ, ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగిపోతుందని, అదనపు భారం పడుతుందని పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావం సామాన్యులపై కూడా పడుతుందని పేర్కొంటున్నారు. బల్క్ డీజిల్ ధర పెరుగుదల కారణంగా పరిశ్రమలు ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఇరాన్, ఆమెరికా-ఇజ్రాయెల్ మఽధ్య యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా వాహనదారులు వినియోగించే ప్రీమియం (పవర్) పెట్రోలు ధర లీటర్‌కు రూ.2కు పైగా పెంచిన ఆయిల్ కంపెనీలు... ఇండస్ట్రియల్ డీజిల్ (బల్క్ డీజిల్) ధరను లీటరుకు రూ.22 పెంచేశాయి. ప్రస్తుతం లీటర్‌కు రూ.88గా ఉన్న బల్క్ డీజిల్ ధర దాదాపు రూ.110కు పెరిగింది. దీంతో పారిశ్రామిక అవసరాల కోసం ఆయిల్ కంపెనీల నుంచి భారీస్థాయిలో డీజిల్ కొనుగోలు చేసే పరిశ్రమలపై ఆర్థిక భారం పడనుంది.
నేరుగా ఆయిల్ కంపెనీల నుంచే..
ఇండస్ట్రియల్ డీజిల్‌ను సాధారణ పెట్రోల్ బంకుల్లో విక్రయించరు. పరిశ్రమల నిర్వాహకులు నేరుగా ఆయిల్ కంపెనీల నుంచే పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారు. తమ పారిశ్రామిక అవసరాలకు కోసం సొంతంగా పంపులు ఏర్పాటు చేసుకుంటారు. భారీ పరిశ్రమలు, తయారీ రంగం, లాజిస్టిక్స్, సిమెంట్, ఉక్కు కర్మాగాలు, భారీ యంత్రాలతో పనిచేసే మైనింగ్ కంపెనీలు, పెద్ద పెద్ద జనరేటర్లు వినియోగించే పరిశ్రమలు ఈ బల్క్ డీజిల్‌ను ఎక్కువగా వినియోగిస్తాయి. దీనితో పాటు చిన్న పరిశ్రమలు వినియోగించే ఫర్నేస్ ఆయిల్, హీట్ ట్రీట్‌మెంట్ ఆయిల్ ధరలు పెంచేయడంతో.. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతోందని వాపోతున్నారు. ఫర్నేస్ ఆయిల్ ధర లీటరు రూ.48 నుంచి రూ.78కి పెరిగింది. ఫౌండరీస్, టైర్ రీట్రేడింగ్ ఇండస్ట్రీస్, హీట్ ట్రీట్‌మెంట్, మెటలాజికల్ తదితర పరిశ్రమలు రోజుకు సగటున 40వేల లీటర్ల వరకు వినియోగిస్తాయని అంచనా.
నిండుకుంటున్న నిల్వలు.. డీలర్ల ఆందోళన
యుద్ధ పరిణామాల నేపథ్యంలో క్రూడ్ దరలు పెరిగిపోవడంతో ఆయిల్ కంపెనీలు పెట్రో ఉత్పత్తుల సరఫరాలో కోత విధిస్తున్నాయని, డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో తమ దగ్గర నిల్వలు నిండుకుంటున్నాయని పెట్రోలు బంకుల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత నిధులను అడ్వాన్సుల కింద చెల్లిస్తున్నప్పటికీ.. కంపెనీలు సరఫరాను తగ్గిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. హెచ్‌పీసీఎల్ అధికారులు పెట్రోలు సరఫరాను సరిగ్గా చేయకుండా.. రాత్రిపూట బంకులు మూసేయాలంటూ డీలర్లకు అనధికారిక ఆదేశాలు జారీచేస్తున్నారని చెబుతున్నారు. బీపీసీఎల్, ఐవోసీఎల్ కూడా ఇదే బాటలో కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలు బంకుల్లో స్టాక్ అయిపోతున్నందున, సమస్య తీవ్రతరం దాల్చకముందే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఆయిల్ కంపెనీల రాష్ట్రస్థాయి అధికారులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పౌర సరఫరాల కమిషనర్‌కు వినతిపత్రం అందజేసేందుకు ఏపీ ఇండియన్ ఆయిల్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సిద్ధమవుతున్నారు.