15 రోజులు.. 72 గంటలు
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:14 AM
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ముగిశాయి. ఉభయసభలూ నిరవధికంగా వాయిదా పడ్డాయి
ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఉభయసభలు నిరవధిక వాయిదా
శాసనసభలో 18 బిల్లులకు ఆమోదం
కల్తీ నెయ్యి చుట్టూనే తిరిగిన మండలి
అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ముగిశాయి. ఉభయసభలూ నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 11న గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమైన సమావేశాలు 15 పనిదినాల పాటు జరిగాయి. యథాప్రకారం వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు గైర్హాజరు కావడంతో సభ ఏకపక్షంగా సాగింది. శాసనమండలిలో వైసీపీకే అధిక సంఖ్యాబలం ఉండడంతో ఆ పార్టీ సభను పదే పదే అడ్డుకునేందుకు ప్రయత్నించింది. అసెంబ్లీలో అధికారపక్షమే విపక్షమై ప్రజాసమస్యలను ప్రస్తావించి ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టగా.. మండలిలో ప్రజాసమస్యల ప్రస్తావన కన్నా తిరుమలకు సరఫరా అయిన కల్తీ నెయ్యి అంశంపైనే వైసీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. తీరా చర్చ ప్రారంభిస్తే.. సజావుగా సాగనివ్వలేదు. అప్పటి టీటీడీ పాలకమండళ్లలో పెత్తనం సాగించిన తమ నేతల ప్రమేయం బయటపడుతుందన్న భయంతో చర్చను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. వైసీపీ వ్యూహాలను అధికార కూటమి గట్టిగానే తిప్పికొట్టింది. శాసనసభలో కల్తీ నెయ్యిపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి, దేవదాయ మంత్రి లడ్డూ కల్తీ వ్యవహారాన్ని ప్రజలకు సమగ్రంగా వివరించారు.
సూటిగా.. సంక్షిప్తంగా..
సీఎం చంద్రబాబు ఈ సమావేశాల్లో చేసిన ప్రసంగాలు గతానికి భిన్నంగా ఉండి ఆకట్టుకున్నా యి. తిరుమల లడ్డూ, కూటమి హయాంలో ఉద్యోగ, ఉపాధి కల్పన, జనాభా నిర్వహణపై ఆయన ప్రసంగాలు సూటిగా సమగ్రంగా ఉన్నాయి. ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెబుతూ.. అవసరమైన చోట పవర్ పాయింట్ ప్రజంటేషన్లు కూడా జోడించడంతో ఆయన ప్రసంగాలు ఆసక్తికరంగా మారాయి. ఇక ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను వరుసగా మూడోసారి ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలోనూ.. దానిపై చర్చ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు సభలో మంచి స్పందన వచ్చింది. ‘వైసీపీ నెవ్వర్ ఎగైన్.. కూటమి వన్స్ ఎగైన్’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యకూ మంచి స్పందన వచ్చింది.
అసెంబ్లీ విశేషాలు..
మొత్తం 72 గంటల 14 నిమిషాలపాటు శాసనసభ కార్యకలాపాలు జరిగాయి. 122 ప్రశ్నలకు మౌఖికంగా సమాధానమివ్వగా.. మరో 80 ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలను సభలో ఉంచారు. మొత్తం 18 బిల్లులు ప్రవేశపెట్టగా.. అన్నీ ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. వివిధ అంశాలపై మొత్తం 122 మంది సభ్యులు ప్రసంగించారు
ఈ సమావేశాల నుంచే ఏఐ ఆధారిత సభ్యుల హాజరు నమోదును ప్రారంభించారు.
వినూత్న ఒరవడికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెరదీశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగల పాఠశాలల విద్యార్థులకు సమావేశాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించారు. దీనిని వినియోగించుకుని ఈదఫా 166 పాఠశాలల నుంచి 6,693 మంది విద్యార్థులు అసెంబ్లీని సందర్శించారు. గతంలో ఎప్పుడూ ఇంతలా విద్యార్థులు సభకు రాలేదు.
మండలి సమావేశాలు.. 28 గంటలు
మండలి సమావేశాలు ఈసారి 15 పనిదినాలు జరుగగా.. 28 గంటలు నడిచినట్లు చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు. 18 బిల్లులు ఆమోదించామని.. 115 స్వల్ప ప్రశ్నలకు సమాధానాలు, రెండు లఘు చర్చలు, 3 మంత్రుల ప్రకటనలు, 114 ప్రత్యేక అంశాలను సభ్యులు ప్రస్తావించారని తెలిపారు. 10 వాయిదా తీర్మానాలు అందాయని, ఒక కమిటీ నివేదిక సమర్పించినట్లు చెప్పారు. సభలో వైసీపీకి 32 మంది, టీడీపీ-10, జనసేన-2, బీజేపీ-1, ఇండిపెండెంట్లు-5, నామినేటెడ్ సభ్యులు 8 మందితో మొత్తం 58 మంది ఎమ్మెల్సీలు ఉన్నట్లు పేర్కొన్నారు.