సీట్లు, ఓట్లు కొనాల్సిన దుస్థితి : బుద్ధ ప్రసాద్
ABN , Publish Date - Mar 22 , 2026 | 04:18 AM
రాష్ట్ర రాజకీయాల్లో నేడు సీట్లు, ఓట్లు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అవనిగడ్డ ఎమ్మెల్యే, మాజీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కార్పొరేషన్(కాకినాడ), మార్చి 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజకీయాల్లో నేడు సీట్లు, ఓట్లు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అవనిగడ్డ ఎమ్మెల్యే, మాజీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం రాత్రి కాకినాడలోని యంగ్‌మెన్స్ హ్యాపీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ’మహాపురుషుడు మండలి’ నాటకం, అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయ విశ్రాంత తెలుగు ఆచార్యులు డాక్టర్ కె.మలయవాసినికి దంటు భాస్కరరావు జీవిత సాఫల్య పురస్కార ప్రదానోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు అప్పట్లో సాధారణ కార్యకర్తగా ఉండి ఎన్నికలకు డిపాజిట్ కట్టలేని పరిస్థితి వచ్చినప్పటికీ.. నాటి సీఎం నీలం సంజీవరెడ్డి స్వయంగా పిలిచి బందరు టికెట్ ఇచ్చారని గుర్తుచేశారు. అప్పట్లో సేవాభావం, నిబద్ధతతో రాజకీయాలు జరిగేవని, కానీ ఇప్పుడు సీట్లు, ఓట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉన్నదన్నారు. తాను నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తనను ప్రతిరోజూ కలచివేస్తున్నాయని అన్నారు. తెలుగు భాష, సాహిత్యాభివృద్ధిపై మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయన్నారు.