హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్
ABN , Publish Date - May 25 , 2026 | 04:10 AM
హత్యారాజకీయాలతోనే వైఎస్ కుటుంబం రాజకీయంగా ఎదిగిందని టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. వాటికి ఆ కుటుంబం కేరాఫ్ అడ్ర్‌సగా నిలుస్తుందని చెప్పారు.
వైఎస్ కుటుంబం వాటితోనే ఎదిగింది: బీటెక్ రవి
వ్యాపారంలోకి తీసుకున్న బీసీని రాజారెడ్డి చంపాడు
ఇందుకు సహకరించిన వ్యక్తి అనుమానాస్పద మృతి
త్రివేణి స్టీల్ యజమాని మురళిరెడ్డినీ చంపారు
శివారెడ్డి హత్యకూ పథకం.. పార్థసారథిరెడ్డి సోదరుడి హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డి, గంగిరెడ్డి ముద్దాయిలు
విపక్షంలో ఉన్నప్పుడే జగన్‌కు తండ్రి మరణం గుర్తొస్తుంది
ఆయనది క్రిమినల్ మనస్తత్వం.. మాజీ ఎమ్మెల్సీ ధ్వజం
అమరావతి, మే 24 (ఆంధ్రజ్యోతి): హత్యారాజకీయాలతోనే వైఎస్ కుటుంబం రాజకీయంగా ఎదిగిందని టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. వాటికి ఆ కుటుంబం కేరాఫ్ అడ్ర్‌సగా నిలుస్తుందని చెప్పారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాటి రాజారెడ్డి నుంచి నేటి జగన్మోహన్‌రెడ్డి వరకు వైఎస్ కుటుంబంలోని మూడు తరాల హత్యారాజకీయాలను వివరించారు. తమ రాజకీయ ఎదుగుదల కోసం ఎందరో అమాయకులను హత్య చేశారని ధ్వజమెత్తారు. వైఎస్ కుటుంబం రాజకీయ కుటుంబం కానే కాదని.. బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా మారి ఆ కాలంలోనే భారతీయులకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపించారు. వార్డు మెంబర్ స్థానంలో ఓడిపోయిన చరిత్ర వైఎస్ కుటుంబానిదని, 1968 స్థానిక ఎన్నికల్లో రాజశేఖర్‌రెడ్డి తల్లి వైఎస్ జయమ్మ.. గాడిచర్ల కృష్ణమూర్తి అనే వ్యక్తిపై ఓడిపోయారని తెలిపారు. 1962లోనే రాజారెడ్డిపై రౌడీషీటర్ కేసు ఉందని, ఆ తర్వాత మంగంపేట బెరైటీస్ గనుల్లో బీసీ వర్గానికి చెందిన వెంకట నరసయ్య అనే వ్యక్తి దగ్గర చేరారని, పెట్టుబడి లేకుండా ఆయన తన వ్యాపారంలోకి రాజారెడ్డిని తీసుకున్నారని చెప్పారు. అనంతరం కాలంలో ఆయన్నే రాజారెడ్డి హత్య చేశారని, ఆ హత్య పునాదిగా ఎదిగారని, ఆ హత్యకు సహకరించిన పౌలిరెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారని తెలిపారు. ఆ తర్వాత త్రివేణి స్టీల్ యజమాని మురళిరెడ్డిని హత్య చేశారని, దీని తర్వాతే కొళ్లం గంగిరెడ్డి కుటుంబంతో బంధం ఏర్పడిందన్నారు. ‘1989లో చిన్నముడియంలో రిగ్గింగ్ చేయడానికి రాజారెడ్డి వెళ్లారు. ఆ గ్రామస్థులు అడ్డుకున్నారు. ఆ తర్వాతే వైఎస్ కుటుంబం శివారెడ్డి హత్యకు ప్లాన్ చేసింది.
శివారెడ్డి మరణం తర్వాతే ఆ కుటుంబం రాష్ట్ర రాజకీయాల్లో ఎదిగింది. పులివెందులలో అనేక హత్యలతో రాజారెడ్డికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్నాయి. తమకు వ్యతిరేకంగా పోటీచేసిన పేర్ల పార్థసారథిరెడ్డిపై హత్యాయత్నం చేశారు. కత్తులతో నరికారు.. తర్వాత పార్థసారథిరెడ్డి వర్గీయులు రాజారెడ్డిని హత్య చేశారు. పార్థసారథిరెడ్డి సోదరుడు ఉమారెడ్డి కూడా హత్యకు గురయ్యారు. ఈ కేసులో వైఎస్ అవినాశ్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి, భారతీరెడ్డి తండ్రి ఈసీ గంగిరెడ్డి తదితరులు ముద్దాయిలు. తర్వాతి కాలంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పార్థసారథిరెడ్డి వర్గీయులను జైల్లో పెట్టి నానా హింసలకు గురి చేశారు. వాళ్లకు కనీసం పెరోల్ రాకుండా చేసి కుటుంబాలకు దూరం చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి.. వాళ్లను తానేమీ చేయలేదని మాట్లాడడం సిగ్గు చేటు. కడపలో రిగ్గింగ్‌కు పాల్పడి గెలిచిన నీచ చరిత్ర రాజశేఖర్‌రెడ్డిది. రాజారెడ్డి వారసుడిగా ఆయన చేసిన ఫ్యాక్షన్ రాజకీయాలు అన్నీ ఇన్నీ కావు. లింగాల మండలంలో కృష్ణారెడ్డిని హత్య చేయించారు. రాజశేఖర్‌రెడ్డి అదే సమయంలో హైదరాబాద్‌లో ఓ మిలిటరీ అధికారితో గొడవపడ్డారు. ఎవరికీ అనుమానం రాకుండా కేసు నుంచి తప్పించుకున్నారు. రిగ్గింగ్ చేసేందుకు డైనమైట్స్ పెట్టి లింగాల మండలంలో భయాందోళనలు సృష్టించారు. తర్వాత రఘురామిరెడ్డిని హత్య చేశారు. విలేకరి నారాయణ, నంద్యాపల్లి శివరామిరెడ్డినీ చంపారు’ అని వివరించారు.
టీడీపీని వదిలి రాలేదని పరిటాల హత్య..
జగన్మోహన్‌రెడ్డిది చాలా క్రిమినల్ మనస్తత్వమని.. బెంగళూరులోనే ఉండి ఎరుకల మహేశ్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేయించారని, ఆ తర్వాత మహేశ్ కుటుంబానికే చెందిన 19 ఏళ్ల ఉదయ్, 20 ఏళ్ల సాకి రామాంజనేయులినీ చంపించారని బీటెక్ రవి తెలిపారు. పక్కా ప్లాన్ ప్రకారం మద్యంలో మత్తుమందు కలిపి మరీ హత్య చేయించారని, ఆ కేసు తనకు అంటుకుంటుందని జగన్ ఢిల్లీ వెళ్లిపోయారని చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముద్దాయిగా ఉండి చనిపోయిన గంగాధర్‌రెడ్డి ఈ హత్యలో ప్రధాన పాత్ర వహించారని అన్నారు. ‘టీడీపీని వదిలిరానందుకు పరిటాల రవిని హత్య చేయించారు. జగన్ ప్రమేయం లేకుండా పరిటాల హత్య జరగదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్‌కు వాళ్ల నాన్న మరణం గుర్తుకు వస్తుంది. వైఎస్ మరణంలో రిలయన్స్ పాత్ర ఉందని చెప్పి వాళ్ల ఆస్తులపై దాడులు చేశారు. 2020లో అదే రిలయన్స్ కుటుంబానికి చెందిన వ్యక్తికి రాజ్యసభ సీటు ఇచ్చారు. 1996లో ప్రజలే చంద్రబాబును అఖండ మెజారిటీతో గెలిపించారు. ఆయన వెన్నుపోటుదారుడైతే ఎందుకు గెలిపిస్తారు? వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాశ్‌రెడ్డి, వాళ్ల కుటుంబం పాత్ర ఉండడం వాస్తవం కాదా..? వాళ్లను ఏనాడైనా జగన్ వారించారా? ఇజ్రాయెల్‌లో వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆస్తిలో షర్మిలకు 40 శాతం ఇస్తామని చెప్పి.. తర్వాత ఆమెతో పాదయాత్ర చేయించి రాజకీయ లబ్ధి పొందారు. అనంతరం ఆమెను, తల్లిని ఇంటి నుంచి తరిమేశారు. ఇది కాదా వెన్నుపోటు రాజకీయం? న్యాయంగా పంచాల్సిన ఆస్తి వాటా పంచకుండా సొంత చెల్లికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్మోహన్‌రెడ్డిది. వైఎస్ కుటుంబానికి నమ్మకంగా ఉంటున్న సతీశ్‌రెడ్డిపై హ్యాండ్ గ్రెనేడ్ వేసి హత్యకు పథకం రచించారో లేదో సతీశ్‌రెడ్డే బహిరంగంగా చెప్పాలి’ అని రవి సవాల్ విసిరారు.