అడ్డొస్తున్నాడని అంతమొందించారు!
ABN , Publish Date - Apr 30 , 2026 | 03:41 AM
చిత్తూరు జిల్లా వి.కోట మండల ‘ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్ వారణాసి జగన్మోహన్‌రెడ్డి హత్య వెనుక కారణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
పక్కా ప్రణాళికతోనే ‘ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్ జగన్ హత్య
ఘటనలో స్థానిక బీఎస్పీ నాయకుడు శ్రీనివాసులు హస్తం
సెటిల్మెంట్లు, అక్రమ దందాలకు అడ్డుపడుతున్నాడని మంట
పది రోజుల ముందునుంచీ తమీమ్‌తో కలసి హత్యకు ప్లాన్
బెంగళూరులో లొంగిపోయిన నిందితులు తమీమ్, సుభాన్
చిత్తూరు, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా వి.కోట మండల ‘ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్ వారణాసి జగన్మోహన్‌రెడ్డి హత్య వెనుక కారణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తమ అక్రమ దందాలు, సెటిల్మెంట్లకు అడ్డొస్తున్నాడనే పక్కా ప్రణాళిక ప్రకారం ఆయన్ను కిరాతకంగా పొడిచి చంపారని భావిస్తున్నారు. జగన్ హత్యకు పోలీసులు భావిస్తున్న కారణాలివీ...
వి.కోటకు చెందిన ఆరీఫ్ గంజాయి సరఫరా చేస్తున్నాడని 2021లో బెంగళూరులోని శివాజీనగర్ కమర్షియల్ పోలీస్‌స్టేషన్‌లో తమీమ్ ఫిర్యాదు చేశాడు. విచారించిన పోలీసులు ఆరీఫ్ హస్తం లేదని తేల్చారు. తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు గంజాయి సరఫరా చేస్తున్నాడనే కారణంగా తమీమ్‌పైనే కేసు పెట్టారు. ఈ ఘటనలో తమీమ్ 3 నెలలు జైలులో ఉన్నాడు. వి.కోటకు చెందిన బీఎస్పీ నేత శ్రీనివాసులు బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చాడు. మిత్రుడైన ఆరీఫ్ కు జగన్ అండగా నిలిచారు. అప్పటి నుంచే జగన్‌పై తమీమ్ శత్రుత్వం పెంచుకున్నాడు.
వి.కోటలో 2024 సెప్టెంబరులో మత ఘర్షణలు జరిగాయి. ఇందులో కీలక పాత్ర పోషించిన తమీమ్‌పై పోలీసులు 3 కేసులు పెట్టగా, 31 రోజులు జైలులో ఉన్నాడు. అప్పుడు కూడా శ్రీనివాసులే జామీను ఇచ్చాడు. ఆ తర్వాత తమీమ్‌ను ముస్లిం మతపెద్దలు ఊరి బహిష్కరణ చేశారు. దీనికి కూడా జగనే కారణమని తమీమ్ భావించాడు.
పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన జాకీర్, గోపాల్ వద్ద శ్రీనివాసులు రూ.5లక్షలు తీసుకుని ఓ భూమి పట్టాను అమ్మాడు. విషయం తెలుసుకున్న జగన్ స్థానిక తహసీల్దార్‌తో మాట్లాడి ఆ పట్టా నకిలీదని తేల్చారు. దీంతో జాకీర్, గోపాల్.. శ్రీనివాసులు వద్దకెళ్లి తామిచ్చిన డబ్బు వెనక్కి తీసుకున్నారు. దీనికితోడు వ్యక్తిగత వివాదాలూ ఉండటంతో జగన్‌పై శ్రీనివాసులు కక్ష పెట్టుకున్నాడు.
ఓ కేసు విషయమై 24న చిత్తూరు కోర్టుకు జగన్ హాజరయ్యారు. తన మేనత్త కొడుకు సుభాన్‌తో అక్కడకు వచ్చిన తమీమ్.. సుమారు గంటసేపు జగన్‌తో మాట్లాడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తర్వాత నాలుగు రోజులకే ఈ హత్య జరిగింది.
బీఎస్పీ నేత శ్రీనివాసులు వారం రోజులుగా తమీమ్‌తో పాటు వి.కోటలో తిరిగాడు. 23వ తేదీ తర్వాత నుంచి ఆయన సాధారణ కాల్స్ బదులు వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జగన్ హత్యకు గురైన ఈ నెల 28వ తేదీ నుంచే శ్రీనివాసులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, జగన్ హత్య కేసులో నిందితులు తమీమ్, అతడి బావమరిది సుభాన్ బుధవారం రాత్రి బెంగళూరులోని ఎలక్ర్టానిక్ సిటీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే వీరు ఇద్దరూ బెంగళూరులో లొంగిపోయినట్లు తెలుస్తోంది.
మంత్రి సత్యకుమార్ ఖండన
‘ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్ జగన్మోహన్‌రెడ్డి హత్య అత్యంత దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బుధవారం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆయన మాట్లాడారు. మీడియా సంస్థలు, విలేకరులపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.
జర్నలిస్టులపై దాడుల నివారణకు కమిటీలను పునరుద్ధరించాలి: ఐజేయూ
జగన్ హత్యకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ముందుగా నిరసన ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు. ఐజేయూ సెక్రటరీ జనరల్ డి..సోమసుందర్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడుల నివారణకు గతంలో రాష్ట్ర స్థాయి హైపవర్ కమిటీ, జిల్లా స్థాయిలో కమిటీలు ఉండేవని వాటిని పునరుద్ధరించాలని కోరారు.
జగన్‌కు కన్నీటి వీడ్కోలు
వి.కోటలో ముగిసిన అంత్యక్రియలు
అధికారులతో సమీక్షించిన సీఎం
ఫోనులో పరామర్శించిన అనిత
వి.కోట ‘ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్ జగన్మోహన్‌రెడ్డి అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా రిపోర్టర్లు పెద్దఎత్తున హాజరయ్యారు. వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చి, జగన్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మండల వాసులు పోటీపడి జగన్ పాడె మోశారు. శ్మశానంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. అంత్యక్రియలు సాఫీగా సాగేందుకు పెద్దఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. టీడీపీ కార్యవర్గ ప్రమాణస్వీకారంలో ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు. అమర్ సతీమణి రేణుక హాజరై, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. హత్య విషయాన్ని అమర్నాథరెడ్డి.. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆయన అధికారులతో సమీక్షించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుల్ని వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లా పోలీసు యంత్రాంగం అదే పనిలో ఉందని జగన్ భార్యకు హోంమంత్రి అనిత ఫోన్‌లో హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. కాగా, బుధవారం కూడా చిత్తూరు జిల్లావ్యాప్తంగా జర్నలిస్టులు నిరసనలు చేసి, పోలీసులకు ఫిర్యాదులు చేశారు.