Share News

యువకుడి దారుణహత్య

ABN , Publish Date - Feb 04 , 2026 | 01:10 AM

విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుట్కా, పాన్‌పరాగ్‌ అమ్మకాల విషయంలో స్నేహితుడితో ఏర్పడిన వివాదమే అతని ప్రాణాలు తీసింది. ఇదంతా చూసిన ప్రయాణికులు భయంతో పరుగులుతీశారు.

యువకుడి దారుణహత్య

-రైల్వేస్టేషన్‌లో మద్యం సీసాతో దాడి చేసి చంపిన స్నేహితుడు

-పాన్‌పరాగ్‌, గుట్కా విక్రయం విషయంలో గొడవ

-భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు

- మృతుడిది అమలాపురం జిల్లా కాంట్రేనికోన

రైల్వేస్టేషన్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి):

విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుట్కా, పాన్‌పరాగ్‌ అమ్మకాల విషయంలో స్నేహితుడితో ఏర్పడిన వివాదమే అతని ప్రాణాలు తీసింది. ఇదంతా చూసిన ప్రయాణికులు భయంతో పరుగులుతీశారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని పూర్ణానందంపేటకు చెందిన సరగడ రాము అలియాస్‌ పొట్టి రాము, అమలాపురం జిల్లా కాంట్రేనికోన గ్రామానికి చెందిన సాయి (30) స్నేహితులు. వీరిద్దరూ విజయవాడ రైల్వేస్టేషన్‌లో, రైళ్లలో గుట్టుగా పాన్‌పరాగ్‌, గుట్కా, సిగరెట్లు విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇద్దరూ మద్యం తాగారు. సరగడ రాము వద్ద ఉన్న పాన్‌పరాగ్‌, గుట్కా సరుకును సాయి తీసుకుని, వాటిని విక్రయించమని అప్పారావు అనే వ్యక్తికి ఇచ్చాడు. అప్పారావు ఆ సరుకును మళ్లీ రాముకు ఇచ్చి సాయు సరుకులు అమ్మమన్నాడని చెప్పాడు. ఈ విషయంపై మద్యం మత్తులో ఉన్న రాము సాయితో గొడవపడ్డాడు. ఒకరినొకరు దూషించుకుంటూ ఘర్షణపడ్డారు. ఆ తర్వాత ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ఆగ్రహంతో ఉన్న రాము సాయిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. మంగళవారం ఉదయం సుమారు 6.30 గంటలకు సాయి రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలోని 7-8 ప్లాట్‌ ఫారాల మధ్య దారిలో నడుచుకుంటూ వెళుతుండగా, అప్పటికే మద్యం సీసాతో సిద్ధంగా ఉన్న రాము సాయిపై ఒక్కసారిగా దాడి చేశాడు. అతి కిరాతకంగా సీసాతో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన సాయి అక్కడికక్కడే చనిపోయాడు. అక్కడే ఉన్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. నిందితుడు కొద్దిసేపు అక్కడే ఉండి మద్యం సీసాతో వీరంగం చేసినట్లు పలువురు ప్రయాణికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న జీఆర్పీ సీఐ జె.వి.రమణ సిబ్బందితో ఘటనా ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ప్రయాణికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతుడి వద్ద లభించిన గుర్తింపు ఆధారాల ద్వారా అతని సొంతూరులో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విజయవాడ రైల్వే స్టేషన్‌ సూపరింటెండెంట్‌ ఇంతియాజ్‌ ఖాన్‌ లోడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుడు సరగడ రామును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మృతుడికి వివాహం కాలేదు. నిందితుడు రాము పూర్ణానందంపేటలో భార్య, కుమారుడితో ఉంటున్నాడు. రాముపై కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో డెకాయిట్‌ కేసుతో సహా 15 కేసులు ఉన్నాయి.

Updated Date - Feb 04 , 2026 | 01:10 AM