Share News

గిరిజనుడి దారుణ హత్య

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:36 PM

మండల కేంద్రంలో ఒక గిరిజనుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇంట్లో నిద్రిస్తున్న అతనిని మంగళవారం వేకువజామున ఇద్దరు వ్యక్తులు బయటకు పిలిచి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు.

గిరిజనుడి దారుణ హత్య
హత్యకు గురైన కుర్తాడి నాగేశ్వరరావు(ఫైల్‌ ఫొటో)

గంటల వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులు

పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

వివాహేతర సంబంధమే హత్యకు కారణం

ముంచంగిపుట్టు, మార్చి 3(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఒక గిరిజనుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇంట్లో నిద్రిస్తున్న అతనిని మంగళవారం వేకువజామున ఇద్దరు వ్యక్తులు బయటకు పిలిచి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. సీఐ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు, క్లూస్‌ టీం రంగంలోకి దిగి హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. దీనికి సంబంధించి జి.మాడుగుల సీఐ బి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. పెదబయలు మండలం అరడకోట పంచాయతీ కేంద్రానికి చెందిన కుర్తాడి నాగేశ్వరరావు(28) అక్కడే మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. కాగా జీపు డ్రైవర్‌గా పని చేస్తూ పెదబయలు మండల కేంద్రంలో అరుణ్‌ అనే వ్యక్తి తన భార్యతో నివాసముంటున్నాడు. అయితే ఏడాది కిందట కుర్తాడి నాగేశ్వరరావుతో అరుణ్‌ భార్యకు పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీనిపై భార్యతో అరుణ్‌ తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో అరుణ్‌తో అతని భార్య గొడవ పడి కుర్తాడి నాగేశ్వరరావు ఇంటికి వచ్చేసింది. దీంతో వీరిద్దరూ పది రోజుల క్రితం ముంచంగిపుట్టు రామాలయం సమీపంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఈ విషయాన్ని అరుణ్‌ తన బావమరిది (భార్య అన్నయ్య) వంతాల నాగేశ్వరరావుకు చెప్పాడు. ఈ క్రమంలో అరుణ్‌, అతని బావమరిది మంగళవారం వేకువజామున నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి తలుపుకొట్టారు. నాగేశ్వరరావు బయటకు వచ్చిన వెంటనే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి అరుణ్‌, అతని బావమరిది పరారయ్యారు. ఇంట్లో వాళ్లు కేకలు వేయడంతో చుట్టు పక్కవాళ్లు వచ్చి చూసేసరికి నాగేశ్వరరావు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని మెడ, చేతిపైన తీవ్ర గాయాలు ఉన్నాయి. కొన ఊపిరితో ఉన్న అతనిని స్థానిక సీహెచ్‌సీకి తరలించేలోపు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జి.మాడుగుల సీఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. నిందితులను గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతదేహానికి సీహెచ్‌సీలో పోస్టుమార్టం చేయించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 11:36 PM