భయపెడుతున్న ‘బ్రూసెల్లోసిస్’
ABN , Publish Date - May 22 , 2026 | 05:37 AM
పశువుల పునరుత్పత్తి వ్యవస్థను దెబ్బతీసే అత్యంత ప్రమాదకర బ్రూసెల్లోసిస్ బ్యాక్టీరియా వ్యాప్తి కలవరపాటుకు గురిచేస్తోంది. కర్నూలు జిల్లా బనవాసి జెర్సీ పశుక్షేత్రంలోని..
బనవాసిలోని పశు క్షేత్రంలో 8 పశువులకు పాజిటివ్
ఇద్దరు కూలీలకూ వ్యాధి.. క్వారంటైన్‌లోకి
కర్నూలు, మే 21 (ఆంధ్రజ్యోతి): పశువుల పునరుత్పత్తి వ్యవస్థను దెబ్బతీసే అత్యంత ప్రమాదకర బ్రూసెల్లోసిస్ బ్యాక్టీరియా వ్యాప్తి కలవరపాటుకు గురిచేస్తోంది. కర్నూలు జిల్లా బనవాసి జెర్సీ పశుక్షేత్రంలోని ఆబోతు వీర్య నిల్వ కేంద్రంలో ఎనిమిది పశువులతోపాటు వాటిని సంరక్షించే ఇద్దరు కూలీలకు కూడా బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ జబ్బు క్రమంగా మనుషులకూ విస్తరించే ప్రమాదం ఉందని పరిసర గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే.. వ్యాధి విస్తరించకుండా వీర్య నిల్వ కేంద్రం వైద్యులు నివారణ చర్యలు చేపట్టారు. బ్రూసెల్లోసిస్ సోకిన ఎనిమిది పశువులను, ఇద్దరు కార్మికులను క్వారంటైన్‌కు తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అలాగే ఆ ఆబోతుల నుంచి తీసిన వీర్యాన్ని నిర్వీర్యం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు ఏడాది నుంచి సేకరించిన సుమారు రూ.3.85కోట్ల విలువైన 1.28 లక్షల వీర్యం డోసులను నిర్వీర్యం చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా, ఈ బ్యాక్టీరియా విస్తరించకుండా పరిసర గ్రామాల్లో కూడా పశువులకు రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తామని పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ హేమంత్‌కుమార్ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.
వ్యాధిని గుర్తించారిలా..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి జెర్సీ పశుక్షేత్రాన్ని 1986లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ముర్రాజాతి సంతతి, జెర్సీ జాతి, హోల్‌స్టీమ్ ఫ్రీషిమన్ జాతి (హెచ్‌ఎ్‌ఫ), క్రాస్ బీడ్ జెర్సీ జాతి (సీబీజెవై), సీబీహెచ్‌ఎ్‌ఫ, ఐజిఐఆర్.. వంటి రకాల జాతులకు చెందిన 88 ఆవులు, గేదెల జాతికి చెందిన ఎద్దులు, దున్నపోతులు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా దాదాపు 17-20 లక్షల డోసులకు పైగా వీర్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. వీటి ఆరోగ్యంపై అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. క్రమం తప్పకుండా నిర్వహించే పరీక్షల్లో భాగంగా ఇటీవల 88 పశువుల రక్త నమూనాలను బెంగళూరులోని ఎస్‌ఆర్‌డీడీఎల్ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ పరీక్షల్లో జెర్సీ జాతికి చెందిన 5ఎద్దులు, ముర్రా జాతికి చెందిన 3దున్నపోతులకు బ్రూసెల్లోసిస్ బ్యాక్టీరియా పాజిటివ్ వచ్చింది. వాటి సంరక్షణ కోసం పనిచేస్తున్న కూలీల రక్త నమూనాలను కూడా పరీక్షలకు పంపగా ఇద్దరికి బ్రూసెల్లోసిస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వీర్య నిల్వ కేంద్రం వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. బ్యాక్టీరియా సోకిన పశువులను కిలోమీటరు దూరంలో క్వారంటైన్‌లో ఉంచారు. ఇద్దరు కూలీలను కూడా ప్రత్యేక క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా కిలోమీటరు పరిధిలో ప్రత్యేక మందులు చల్లుతున్నారు. రెండేళ్ల క్రితం కూడా ఇదే క్షేత్రంలో ఒక దున్నపోతుకు ఈ బ్యాక్టీరియా సోకింది.
ఎలా వ్యాప్తి చెందుతుంది..?
బ్రూసెల్లా అబార్టస్ అనే బ్యాక్టీరియా ద్వారా బ్రూసెల్లోసిస్ జబ్బు వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది పశువుల నుంచి మనుషులకు కూడా వ్యాపించే అంటు వ్యాధి. ఈ బ్యాక్టీరియా సోకిన జంతువుల నుంచి సేకరించిన పాశ్చరైజ్ చేయని (పచ్చి) పాలు, ఆ పాలతో చేసిన పన్నీరు, జున్ను వంటి పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ఇది మనుషులకు వ్యాపిస్తుంది. అలాగే వ్యాధి సోకిన జంతువులు ఉన్న పరిసరాలు, పశువుల పాకల్లో గాలి ద్వారా బ్యాక్టీరియా మనుషుల శ్వాస కోశంలోకి ప్రవేశించి ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని పశు వైద్యులు తెలిపారు.
ఇవీ లక్షణాలు..
బ్రూసెల్లా బ్యాక్టీరియా సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి, కీళ్లు, కండరాల నొప్పి, వెన్నునొప్పి, చెమటలు పట్టడం, ఆయాసం, బరువు తగ్గడం, ఆకలి వేయకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకిన వారికి కీళ్ల నొప్పులు జీవితకాలం వేధించే ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ వ్యాధి ముదురుతున్న కొద్దీ కాలేయం, గుండె, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని తెలిపారు. అలాగే ఈ వ్యాధి సోకిన సూడి పశువుల్లో అకాల గర్భస్రావం జరుగుతుంది. సంతానోత్పత్తి తగ్గిపోతుంది. పశువుల్లో బ్రూసెల్లోసి్‌సను శాశ్వతంగా నయం చేయడానికి మందులు లేవు.