Share News

తన్నుకున్న తమ్ముళ్లు

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:43 AM

గ్రామ పంచాయతీ చెరువు విషయంలో నెలకొన్న వివాదం ముదిరి తమ్ముళ్లు తన్నుకునే వరకు వచ్చింది.

తన్నుకున్న తమ్ముళ్లు

- గుడివాడ మండలం లింగవరం గ్రామ సభలో రచ్చ

- చెరువు వివాదంలో టీడీపీ నాయకుడిపై వలస నాయకుల దాడి

- అక్రమాలను ప్రశ్నిస్తున్నానని దాడి చేశారన్న బాధితుడు

గుడివాడ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి):

గ్రామ పంచాయతీ చెరువు విషయంలో నెలకొన్న వివాదం ముదిరి తమ్ముళ్లు తన్నుకునే వరకు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుడివాడ మండలం లింగవరం గ్రామ పంచాయతీకి చెందిన మూడు చెరువులకు మూడు నెలల క్రితం లీజు వేలం నిర్వహించారు. ఈ పాటలో టీడీపీ నాయకులు పోటీ పడ్డారు. కొల్లారెడ్డి కల్యాణ మండపం వద్ద ఉన్న చెరువును గ్రామానికి చెందిన పంజాల శ్రీనివాసరావు అలియాస్‌ మిల్లు శ్రీను సుమారు రూ.2.80 లక్షలకు దక్కించుకున్నారు. మిగిలిన రెండు చెరువుల పాటలు కూడా పోటాపోటీగా సాగాయి. ఎన్నికల ముందు టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు మందపాటి గోపాలస్వామి, చిరంజీవిరెడ్డి చెరువులను దక్కించుకున్నారు. పంజాల శ్రీనివాసరావు నెల రోజుల క్రితం తాను పాడుకున్న చెరువుగట్టును ఎంపీడీవో బి.వై.విష్ణుప్రసాద్‌ను సంప్రదించి శుభ్రం చేసుకున్నారు. అయితే గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం పాడుకున్న వారు చెరువులో చేపలు పెంచుకోవాలని, అలా కాకుండా గట్టుపై ఉన్న కలపను కొట్టి శ్రీనివాసరావు అమ్ముకున్నారని, అలాగే కోళ్ల వ్యర్థాలను చెరువులో వేస్తున్నారంటూ మందపాటి గోపాలస్వామి ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల రోజులుగా గ్రామంలో ఇరువర్గాల మధ్య అగ్గిరాజుకుంది. సోమవారం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో చెరువు విషయంలో మిల్లు శ్రీను, గోపాలస్వామి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కుర్చీలో కూర్చోని ఉన్న తనపై గోపాలస్వామి, చిరంజీవిరెడ్డి, మందపాటి శివయ్య దాడి చేసి, గుండెలపై కాళ్లతో తన్నారని బాధితుడు మిల్లు శ్రీను ఆరోపించారు. ఇటీవలే తనకు గుండె సంబంధిత శస్త్రచికిత్స జరిగిందని, గుండెలపై గుద్దడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నానని, చేతులు కూడా సరిగ్గా పని చేయడంలేదని అనడంతో మిల్లు శ్రీనును వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

నన్ను చంపాలనే కుట్ర పన్నారు

- టీడీపీ నాయకుడు మిల్లు శ్రీను

తాను 1983 నుంచి టీడీపీలో కొనసాగుతున్నానని ఆ పార్టీ నాయకుడు మిల్లు శ్రీను అన్నారు. వైసీపీ నుంచి వలస వచ్చిన చిరంజీవిరెడ్డి, మందపాటి గోపాలస్వామి, శివయ్య గ్రూపుగా ఏర్పడి గ్రామంలో అరాచకాలు సాగిస్తున్నారని ఆరోపించారు. వారు చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్నాననే కక్షతో తనను చంపాలని చూశారని ఆరోపించారు. స్థానికులు లేకుంటే తాను ప్రాణాలతో బయటపడేవాడిని కాదని కన్నీటిపర్యాంత మయ్యారు. గత 20 సంవత్సరాలుగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి మట్టి అక్రమ తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి కొడాలి నాని వెంట ఉన్న వీరు ఎన్నికల ముందు టీడీపీలో చేరి, గ్రామంలోని టీడీపీ, జనసేన నాయకులను పక్కన పెట్టి అరాచకాలు, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి చర్యలతో పార్టీకి గ్రామంలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. పార్టీ అధిష్టానం స్పందించి వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి, తనకు న్యాయం చేయాలని మిల్లు శ్రీను కోరారు.

Updated Date - Jan 06 , 2026 | 12:43 AM