Share News

బ్రిటిష్‌ కాలంనాటి బ్రిడ్జికి బైబై!

ABN , Publish Date - Mar 20 , 2026 | 05:23 AM

స్వాతంత్ర్యానికి పూర్వం బెజవాడలో బ్రిటిషర్ల హయాంలో నిర్మించిన చారిత్రక రైల్వే వంతెన ఆనవాళ్లు కనుమరుగు కానున్నాయి. 1893 మార్చి 17న కృష్ణానదిపై తొలి మీటర్‌ గేజ్‌ బ్రిడ్జిగా దీనిని నిర్మించారు.

బ్రిటిష్‌ కాలంనాటి బ్రిడ్జికి బైబై!

  • 133 ఏళ్ల క్రితం బెజవాడలో కృష్ణా నదిపై రైల్వే వంతెన

  • మద్రాస్‌- సదరన్‌ మరాఠా రైల్వేలో నిర్మాణం

  • 1893- 1989 వరకూ నిరంతరాయంగా సేవలు

  • ఇప్పుడు 3వ బ్రిడ్జి కోసం నాటి పిల్లర్ల తొలగింపు

  • లిమిటెడ్‌ బ్లాస్టింగ్‌ విధానానికి ఇంజనీర్ల యోచన

  • (విజయవాడ-ఆంధ్రజ్యోతి)

స్వాతంత్ర్యానికి పూర్వం బెజవాడలో బ్రిటిషర్ల హయాంలో నిర్మించిన చారిత్రక రైల్వే వంతెన ఆనవాళ్లు కనుమరుగు కానున్నాయి. 1893 మార్చి 17న కృష్ణానదిపై తొలి మీటర్‌ గేజ్‌ బ్రిడ్జిగా దీనిని నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి గత మంగళవారం 133 ఏళ్లు నిండాయి. దాదాపు శతాబ్ద కాలం సేవలందించిన ఈ వంతెన స్థానంలో ఇప్పుడు అధునాతన డబుల్‌ లైన్‌ బ్రిడ్జిని నిర్మించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. విజయవాడ- గూడూరు మార్గంలో ఉన్న అవసరాల రీత్యా చారిత్రక రైల్వే బ్రిడ్జి పిల్లర్లను తొలగించే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. హైడ్రాలిక్‌ క్రేన్ల సహాయంతో పిల్లర్లను పగులగొట్టాలని రెండు వారాలకు పైగా ప్రయత్నిస్తున్నా వీలు పడట్లేదు. దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు.

అప్పట్లో కృష్ణా ప్యాలెస్‌

మద్రాస్‌- సదరన్‌ మరాఠా (ఎంఎస్ఎం) రైల్వేను 1856లో అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో విజయవాడ జిల్లా అంతర్భాగంగా ఉండేది. 1893లో కృష్ణానదిపై మీటర్‌ గేజ్‌ విధానంలో 3 కిమీ పొడవున రైలు బ్రిడ్జిని నిర్మించారు. దీనికి అప్పట్లో కృష్ణా ప్యాలె్‌సగా నామకరణం చేశారు. ఆ రోజుల్లో దీని నిర్మాణానికి ఎలాంటి స్టీల్‌ వాడలేదు. కేవలం రాతిబండలు, గానుగ సున్నాన్ని మాత్రమే ఉపయోగించారు. దీనికి గ్రాండ్‌ ఎంట్రన్స్‌ మార్గంలో నిర్మించిన రెండు కోట బురుజులను తలపించే నిర్మాణాలు ఇప్పటికీ ఉన్నాయి. 1897 జూలై 15న ఈ బ్రిడ్జిని బ్రాడ్‌ గేజ్‌గా అప్‌గ్రేడ్‌ చేశారు. అప్పటి నుంచి ఈ వంతెన 1989 వరకు సేవలందించింది. తర్వాత ఈ బ్రిడ్జికి తూర్పున ఈస్ట్‌ రైల్వే బ్రిడ్జి (సింగిల్‌ లైన్‌), పశ్చిమం వైపు వెస్ట్‌ రైల్వే బ్రిడ్జి నిర్మించారు. ఈ రెండింటి మధ్యలో ఉన్న చారిత్రక బ్రిడ్జిని 1989 తర్వాత తొలగించారు. కేవలం పిల్లర్లే మిగిలాయి. ప్రస్తుతం మూడో రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం వీటిని పగులగొడుతున్నారు.


పగలగొట్టడం ఎందుకంటే...

చారిత్రకమైన బ్రిడ్జి తాలూకా ఆనవాళ్లను ధ్వంసం చేయొద్దని రెండు దశాబ్దాలుగా రైల్వే ఉన్నతాధికారులకు విజయవాడ ప్రజలు లేఖలు రాస్తున్నారు. దీంతో రైల్వే కూడా వీటిని తొలగించడానికి ప్రయత్నించలేదు. ఇప్పుడు ఈ బ్రిడ్జిని తొలగించకుండా అధునాతన డబుల్‌ లైన్‌ రైల్వే బ్రిడ్జిని నిర్మించడం అసాధ్యమని రైల్వేబోర్డు భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న రెండు వంతెనల మధ్య కాకుండా వాటికి అవతల నిర్మించాలంటే సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ అనుమతులు అవసరం. ఒకవేళ అనుమతులు తీసుకుని నిర్మించినా వక్రాకారంలో మెయిన్‌ లైన్‌కు కలుస్తుంది. స్టేషన్‌ అత్యంత సమీపంలో ఇలా ఉండకూడదని రైల్వే ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. మధ్యలో ఎత్తుపెంచి నూతన బ్రిడ్జి ఏర్పాటును కూడా పరిశీలించారు. వరదల కారణంగా కాలం తీరిన బ్రిడ్జి పిల్లర్ల వల్ల ఎప్పటికైనా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. పైగా ఇవి ఎప్పుడైనా కూలిపోయి పక్కన ఉన్న రైల్వే బ్రిడ్జిపై పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పిల్లర్లు పటిష్ఠంగానే ఉన్నట్టు కనిపిస్తున్నా.. అలాగే వదిలేస్తే ప్రమాదానికి దారితీయవచ్చని ఇంజనీరింగ్‌ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. దీంతో వీటిని పడగొట్టాల్సిందేనని నిర్ణయం తీసుకున్నారు.

లిమిటెడ్‌ బ్లాస్టింగ్‌ చేస్తేనే..

పిల్లర్లు ఇంకా దృఢంగా ఉండడంతో హైడ్రాలిక్‌ క్రేన్లతో తొలగించడం సాధ్యం కాక రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నారు. ఈ పిల్లర్లకు 100 మీటర్ల పరిధిలో రైల్వే ట్రాక్స్‌ ఉంటే బ్లాస్టింగ్‌ చేయకూడదు. కాబట్టి లిమిటెడ్‌ బ్లాస్టింగ్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ విధానంలో పిల్లర్లకు పగుళ్లు ఏర్పడేలా చేస్తారు. తర్వాత హైడ్రాలిక్‌ క్రేన్లతో వాటిని తొలగిస్తారు.

Updated Date - Mar 20 , 2026 | 05:24 AM