ప్రియుడి ఎంట్రీ.. ఆగిన పెళ్లి!
ABN , Publish Date - Mar 09 , 2026 | 05:39 AM
వరుడు తాళి కట్టే సమయానికి వధువు అక్కడి నుంచి లేచి, సినీ ఫక్కీలో ప్రియుడి వద్దకు వచ్చి, అతని చేయి పట్టుకున్న ఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం....
ఎన్టీఆర్ జిల్లాలో సినిమా తరహా ఘటన
మైలవరం రూరల్, మార్చి 8(ఆంధ్రజ్యోతి): వరుడు తాళి కట్టే సమయానికి వధువు అక్కడి నుంచి లేచి, సినీ ఫక్కీలో ప్రియుడి వద్దకు వచ్చి, అతని చేయి పట్టుకున్న ఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం అనంతవరం గ్రామంలో చోటుచేసుకుంది. జి.కొండూరు మండలానికి చెందిన యువతితో మైలవరం మండలానికి చెందిన యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. శుక్రవారం వరుడు ఇంటి వద్ద వైభవంగా కార్యక్రమాలు జరిగాయి. రాత్రి మరికొన్ని నిమిషాల్లో వరుడు తాళి కడతాడనగా.. పెళ్లికూతురు అక్కడున్న వారందరికీ షాక్ ఇచ్చింది. వధువు ప్రేమించిన యువకుడు మండపంలోకి వచ్చి, పీటలకు ఎదురుగా నిలబడ్డాడు. ప్రేమికుడిని చూసిన వధువు పెళ్లిపీటల మీద నుంచి లేచి వచ్చి ప్రియుడి వెనక నిలబడింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, ప్రియుడే కావాలని పెళ్లి కుమారుడికి, తన తల్లిదండ్రులకు, బంధువులకు తేల్చిచెప్పింది. దీంతో అంతా షాక్‌కు గురయ్యారు. మండపం నుంచి వెళ్లిపోవాలని ఆ యువకుడికి పెళ్లికొడుకు తల్లిదండ్రులు, బంధువులు చెప్పారు. కదలకపోవడంతో ఆ యువకుడితో పాటు వధువుపై వరుడి కుటుంబసభ్యులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న మైలవరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఘర్షణను ఆపారు. పెళ్లి ఏర్పాట్లకు అయిన ఖర్చు నిమిత్తం వధువు తల్లిదండ్రులు వరుడి కుటుంబానికి రూ.20 లక్షలు ఇచ్చేలా పెద్ద మనుషులు పంచాయితీ చేశారు. లేకుంటే 70 సెంట్ల భూమి రాసిచ్చేలా శనివారం అగ్రిమెంట్ రాశారు. కాగా వధువు, ప్రియుడు సొంత బావమరదల్లేనని, నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారని, పెళ్లికుమార్తె తండ్రి బలవంతం వల్లే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం వధువు, ప్రియుడు ఇంట్లో నుంచి వెళ్లిపోగా, బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి నిశ్చయించినట్టు సమాచారం.