నేటి నుంచి విశాఖలో ‘బ్రిక్స్’ సదస్సు
ABN , Publish Date - Aug 22 , 2026 | 04:31 AM
బ్రిక్స్ దేశాల క్రీడలు, యువజన మంత్రుల సమావేశాల నిర్వహణకు విశాఖపట్నం సిద్ధమైంది. కేంద్ర క్రీడలు, యువజన సర్వీసులు, కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అధ్యక్షతన..
హాజరుకానున్న సభ్య దేశాల యువజన, క్రీడా మంత్రులు
నేటి రాత్రి అతిథులకు ఇచ్చే విందుకు సీఎం చంద్రబాబు
బ్రిక్స్ ప్రతినిధులకు భోగాపురం ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం
విశాఖపట్నం/విజయనగరం/భోగాపురం/న్యూఢిల్లీ, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): బ్రిక్స్ దేశాల క్రీడలు, యువజన మంత్రుల సమావేశాల నిర్వహణకు విశాఖపట్నం సిద్ధమైంది. కేంద్ర క్రీడలు, యువజన సర్వీసులు, కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈ నెల 22, 23 తేదీల్లో జరగనున్న సమావేశాలకు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సుకు భారత్‌తో పాటు బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. శనివారం ఉదయం తొట్లకొండలో మొక్కలు నాటడంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. భారత్ అధ్యక్షతన జరగనున్న సమావేశాలను ‘స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం’ అనే ఇతివృత్తం ఆధారంగా నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి మాండవీయ తొలుత ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. శనివారం జరిగే సమావేశంలో విద్య, నైపుణ్యాలు, వ్యవస్థాపకత, సంక్షేమం, సుస్థిరాభివృద్ధి వంటి అంశాలపై చర్చిస్తారు. ఉమ్మడి ప్రకటననూ, సహకార కార్యాచరణ విధానాన్నీ ముగింపు సందర్భంగా ఆమోదిస్తారు. ఆదివారం జరగనున్న క్రీడా మంత్రుల సమావేశంలో క్రీడల విధానంలో ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించడంపై చర్చించనున్నారు. దేశీయ క్రీడలు, క్రీడా రంగంలో సాంకేతిక సహకారం, క్రీడా పరికరాల తయారీ, ఉమ్మడి ప్రకటన ఖరారు చేసే అంశాలపై సమావేశం దృష్టి సారించనుంది. కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల సహాయ మంత్రి రక్షా ఖడ్సే ముగింపు వేడుకల్లో పాల్గొని మాట్లాడతారు. చివరిగా 11 బ్రిక్స్ దేశాల మంత్రులతో కూడిన ప్రతినిధి బృందాలు ఉమ్మడి ప్రకటనకు ఆమోదం తెలుపుతాయి.
శనివారం రాత్రి విశాఖలోని ఓ హోటల్‌లో జరగనున్న గాలా డిన్నర్‌కు సీఎం చంద్రబాబు హాజరవుతారని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, బ్రిక్స్ సదస్సుకు వస్తున్న సభ్యదేశాల ప్రతినిధులకు శుక్రవారం భోగాపురం (అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. మేళతాళాలు, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో తెలుగు సంప్రదాయ రీతిలో విజయనగరం జిల్లా అధికారులు వారికి ఆత్మీయ స్వాగతం పలికారు.