Share News

22, 23 తేదీల్లో బ్రిక్స్‌ దేశాల సమావేశాలు

ABN , Publish Date - Aug 20 , 2026 | 04:09 AM

విశాఖపట్నంలో ఈ నెల 22, 23 తేదీల్లో బ్రిక్స్‌ దేశాల యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి.

22, 23 తేదీల్లో బ్రిక్స్‌ దేశాల సమావేశాలు

  • 11 దేశాల క్రీడా మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు

విశాఖపట్నం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ఈ నెల 22, 23 తేదీల్లో బ్రిక్స్‌ దేశాల యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. 11 దేశాల (బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌) ప్రతినిధులు హాజరుకానున్న ఈ సమావేశాల్లో యువత, క్రీడలు, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ సహకారంపై చర్చించనున్నారు. ‘స్థితిస్థాపకత, నూతన ఆవిష్కరణలు, పరస్పర సహకారం, సుస్థిరతను పెంపొందించడం’ (బిల్డింగ్‌ ఆఫ్‌ రెజిలియన్స్‌, ఇన్నోవేషన్‌, కో-ఆపరేషన్‌ అండ్‌ సస్టెయిన్‌బిలిటీ) అనే అంశంపై సమావేశాలు జరుగుతాయి. ఈ సందర్భంగా 22వ తేదీన తొట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమం, వారసత్వ ప్రదేశ సందర్శన, ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం రాడిసిన్‌బ్లూ హోటల్‌లో యువజన మంత్రుల సమావేశం జరుగుతుంది. అదే రోజు రాత్రి నోవాటెల్‌ హోటల్‌లో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో గాలా డిన్నర్‌ జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి హాజరుకానున్నారు. 23వ తేదీ ఉదయం బ్రిక్స్‌ ఫ్రెండ్‌షిష్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తారు.

Updated Date - Aug 20 , 2026 | 04:09 AM