Share News

లంచావతారులు

ABN , Publish Date - Apr 01 , 2026 | 11:34 PM

ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా లంచావతారుల్లో మార్పు రావడం లేదు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి దందా సాగుతోంది.

లంచావతారులు

దోచుకోవడమే లక్ష్యం

ఏసీబీకి జంకని అక్రమార్కులు

అవినీతి అధికారుల్లో కనిపించని మార్పు

బాధితుల నుంచి ముక్కుపిండి వసూళ్లు

తనిఖీల వేగం పెంచినా ఆగని అవినీతి

తాజాగా ఏసీబీ వలకు పోలీసు శాఖ ఉద్యోగి

ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా లంచావతారుల్లో మార్పు రావడం లేదు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి దందా సాగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే అవినీతి రాజ్యామేలుతోంది. ఎక్కడికక్కడ ఆయా శాఖల్లోని కొందరు అధికా రులు అందిన కాడికి దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. బాధితులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. ఏ శాఖకు ఏ పని కోసం వెళ్లినా పైసలివ్వనిదే ఫైలు కదలడం లేదు. న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులు కొందరు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఏసీబీ అధికారులకు పట్టుబడటం విమర్శలకు తావిస్తోంది. ఏసీబీ ఇటీవల ఆకస్మిక తనిఖీల వేగం పెంచినా ఉమ్మడి జిల్లాలోని అవినీతి అధికారుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు.

నంద్యాల, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అవినీతి అక్రమార్కులు బరి తెగించడం విస్మయం కలిగిస్తోంది. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ టౌన పోలీ సుస్టేషనలో పనిచేస్తున్న రైటర్‌(హెడ్‌ కానిస్టేబుల్‌) కోటేశ్వరరావు మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడటం పోలీసుశాఖతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఉమ్మడి జిల్లాలో కొన్నేళ్లుగా జరిగిన ఏసీబీ దాడుల వివరాలు ఇలా..

--------------------------------------------------------------------------------------------

సంవత్సరం దాడులు

--------------------------------------------------------------------------------------------

2021 12

2022 08

2023 13

2024 03

2025 11

2026లో ఇప్పటి వరకు 06

----------------------------------

ఫైసలివ్వనిదే పని జరగడం లేదన్న..

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో పైసలివ్వనిదే(లంచం) పని జరగడం లేదన్న ప్రచారం జోరందుకుంది. రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిసే్ట్రషన్స, ట్రెజరీ, ఆర్టీఏ, పోలీసు, ఎక్సైజ్‌, ఇరిగేషన, వైద్య ఆరోగ్యశాఖ, గృహ నిర్మాణం, సాంఘిక సంక్షేమశాఖ, ఐసీడీఎస్‌, శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోందన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. కొందరు అధికారులు, సిబ్బంది విచ్చలవిడిగా దోచుకోవడంతో పాటు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న విమర్శలున్నాయి. గతంలో ఆశించిన స్థాయిలో ఏసీబీ తనిఖీలు లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడేవారు. కొన్నినెలలుగా ఏసీబీ అధికా రులు దాడులు విస్తృతం చేయడంతో అక్రమార్కులు వ్యవహారం బట్టబయలవుతోంది.

కనిపించని మార్పు

పలు శాఖల్లో కొందరు అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శించి ఏసీబీకి పట్టుబడిన అవినీతి అధికారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. చివరకు ఎంతో కొంత సమ ర్పిస్తే తప్ప పనిచేయడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. ఏసీబీ అధికారులు తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తారనే ప్రచారం లేకపోలేదు. బాధితులు వెళ్లి వారిని సంప్ర దిస్తేనే వస్తారనా.. లేదంటే ఉదాసీనంగా వ్యవహరించి గాలికి వదిలేస్తారనే అభిప్రాయం అనేక మందిలో ఉంది.

అవినీతి అధికారుల్లో భయాందోళన

ఉమ్మడి జిల్లాలో ఏసీబీ అధికారులు ఇటీవలే ఎక్కువగా తనిఖీ చేస్తున్నారు. పలు ప్రభుత్వ శాఖల్లోని అవినీతి అధికారులు, సిబ్బందిలో భయాందోళన మొదలైంది. తాజాగా మంగళవారం నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ టౌన పోలీసుస్టేషనలో పనిచేస్తున్న రైటర్‌( హెడ్‌ కానిస్టేబుల్‌) కోటేశ్వరరావు బాధితుడి నుంచి రూ.15వేలు లంచం తీసుకుంటూ కర్నూలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మరింత కలవరం రేపుతోంది.

పోలీసు శాఖలో కలవరం...

అక్రమార్కుల భరతం పట్టాల్సిన పోలీసుల్లో కొందరు అవినీతికి పాల్పడుతుండటంపై పలు విమర్శలకు తావిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఏసీబీ తనిఖీలకు కొందరు పోలీసు అధి కారులు సైతం పట్టుబడిన విషయం తెలిసిందే. గత ఏడాదిలో కర్నూలు టౌన పరిధిలోని ఓ పోలీసు అధికారి, 2022లో వెల్దుర్తి పోలీసుస్టేషనలో ఓ ఏఎస్‌ఐ నిందితుడి నుంచి రూ. 40వేలు తీసుకుంటూ అప్పట్లో ఏసీబీకి పట్టుబడ్డాడు. తాజాగా ఆళ్లగడ్డ టౌన పోలీసుస్టేషనలో హెడ్‌కానిస్టేబుల్‌ నిందితుడి నుంచి రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏది ఏమైనా ఏసీబీ అధికారులకు పోలీసు ఉద్యోగి పట్టుబడటం ఉమ్మడి జిల్లా పోలీసుశాఖలో కలవరం రేపినట్లైంది.

ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఉద్యోగులు

గతేడాది మే 16వ తేదీన ఆళ్లగడ్డ ఏడీఈగా పనిచేస్తున్న రవికాంత చౌదరి తరుపున అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ప్రతాప్‌ విద్యుత ట్రాన్సఫార్మర్‌ కోసం ఓరైతు నుంచి రూ.30వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

ఫ నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలంలోని జలకనూరుకి చెందిన వీఆర్వో వెంకటరమణారెడ్డి 2023లో భూమిని ఆనలైన చేయడం కోసం బాధిత రైతు నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. అదే ఏడాదిలో మైన్స అండ్‌ జియాలజీలోని అసిస్టేంట్‌ జియాలజిస్ట్‌ వెంకటేశ్వరరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేసి రూ.50కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.

ఫ గత ఏడాది జూనలో కర్నూలులోని నాల్గవ పట్టణ సీఐ మధుసూదనతో పాటు హెడ్‌కానిస్టేబుల్‌ రవి సైతం ఓ భూవ్యవహారంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికా రులకు చిక్కారు. గత ఐదేళ్లలో గోస్పాడు ఎస్‌ఐగా పనిచేసిన చంద్రశేఖర్‌రెడ్డి, సి. బెళగల్‌ ఎస్‌ఐగా పనిచేసిన శివాంజల్‌, కర్నూలు మహిళా పోలీసుస్టేషనలో ఓ హెడ్‌కానిస్టేబుల్‌, సీసీఎస్‌లో ఓ సీఐ, కర్నూలులోని తాలూకాలో పనిచేసిన ఓ సీఐతో పాటు రెడ్డి అనే కానిస్టేబుల్‌ కూడా పట్టుబడినట్లు ఏసీబీ లెక్కల ద్వారా తెలుస్తోంది.

ఫ ఈ ఏడాది జనవరి 6న కర్నూలు మహిళా పోలీసుస్టేషనలో పనిచేస్తున్న ఎస్‌ఐ కిరణ్‌బాబు రూ.30వేలు, 23న డోన మండలం జగదుర్తి వీఆర్వో తలారి లాలెప్ప రైతు నుంచి రూ.40వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఫిబ్రవరి 5న ఆత్మకూరు మున్సిపల్‌ కమిషనర్‌ రమేశ బిల్‌కలెక్టర్‌ సిబ్బందితో కలిసి రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏసీబీ అధికారులకు పోలీసులు చిక్కిన జాబితా పరంగా చూస్తే.. కొన్ని పోలీసుస్టేషన్లు సెటిల్‌మెంట్‌ అడ్డాలుగా మారాయనే ఆరోపణలు లేకపోలేదు.

సమాచారమిస్తే గోప్యంగా ఉంచుతాం

ఎక్కడైన ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి అక్రమాలతో పాటు ఆదాయానికి మించిన ఆస్తుల విషయాలపై సమాచారమిస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. ప్రభుత్వ ఉద్యో గులతో ఇబ్బందులు ఎదుర్కొంటే...నేరుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయండి.

ఫ సోమన్న, ఏసీబీ డీఎస్పీ, కర్నూలు

Updated Date - Apr 01 , 2026 | 11:34 PM