ఇల కైలాసంలో బ్రహ్మోత్సవ శోభితం
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:00 AM
శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ఆదివారం నుంచి ఈనెల 18వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
నేటి నుంచి 18 వరకు మహా శివరాత్రి వేడుకలు
సర్వాంగ సుందరంగా ముస్తాబైన శ్రీశైల క్షేత్రం
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
శ్రీశైలం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ఆదివారం నుంచి ఈనెల 18వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే శ్రీశైల పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంత భక్తులతో కలిపి సుమారు 10 లక్షల మంది స్వామిఅమ్మవార్ల దర్శనాలు చేసుకుంటారని అధికారుల అంచనా. భక్తులకు అవసరమయ్యే సకల సదుపాయాలకు సుమారు రూ.12 కోట్ల అంచనా వ్యయం అవుతుందని ఈవో శ్రీనివాసరావు మరియు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన పోతుగుంట రమేశ నాయుడు వెల్లడించారు.
వాహన సేవలు ఇలా..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం యాగశాల ప్రవేశం, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 9న భృంగి వాహన సేవ, 10న హంస వాహనం, 11న మయూర వాహనం, 12న రావణ వాహనం, 13 పుష్ప పల్లకీ సేవ, 14 గజవాహన సేవ నిర్వహించనున్నారు. 15న మహా శివరాత్రి రోజున ప్రభోత్సవం, నంది వాహనసేవ, లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవ లీలా కల్యాణం, 16 రథోత్సవం, తెప్పోత్సవం, 17న యాగపూర్ణాహుతి, ధ్వజావరోహణ కార్యక్రమాలు జరగనున్నాయి. 18న అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
పట్టు వస్త్రాల సమర్పణ ఇలా..
ఆదివారం శ్రీకాళ హస్తీశ్వరస్వామి దేవస్థానం తరపున పట్టువసా్త్రలు సమర్పించనున్నారు. 9న వేంకటేశ్వర స్వామివార్ల దేవస్థానం ద్వారకా తిరుమల తరపున, 10న దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి తరపున, 11న ఉదయం కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం తరపున, సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున, 12న రాష్ట్ర ప్రభుత్వం తరపున భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
దర్శన విధానాలు
ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను ఆదివారం నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. అదే విధంగా వీఐపీలు, సామాన్య భక్తులకు స్వామివారి స్పర్శదర్శనాలు రద్దు చేశారు. జ్యోతిర్ముడి స్వాములకు మాత్రమే 8 నుంచివ 12 తేది వరకు ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించారు. ఆనలైన ద్వారా శీఘ్ర అతిశీఘ్ర దర్శనాలతో పాటు 500 రూపాయల సర్వ దర్శనం, లడ్డూప్రసాదాలు, కేశ ఖండన టిక్కెట్లు విరివిగా అందుబాటులో ఉంచుతున్నారు.
తాత్కాలిక వసతులు
13 ఎకరాల విస్తీర్ణంలో వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక వసతి సౌకర్యాలు కల్పించారు. శివదీక్షా శిబిరాలు, బసవవనం, బాలగణేషవనం, శివాజీ గోపురం, రుద్రపార్కు, మల్లమ్మకన్నీరు, సాక్షి గణపతి ప్రాంగణం, కళ్యాణకట్ట వంటి ఆరుబయలు ప్రదేశాల్లో చలువ పందిళ్లతోపాటు స్నానపు ఘాట్‌లు, 813 శాశ్వత మరియు 200 తాత్కాలిక శౌచాలయాలు ఏర్పాటు చేశారు.
నిరంతర నిఘా
ప్రత్యేక కమాండ్ కంటోల్ రూంలో అన్ని విధాలైన 606 నిఘా నేత్రాలు, 12 డ్రోన కెమెరాలతో క్షేత్రపరిధినంతా రేయింబవుళ్లు 33 ఎల్‌ఈడీ స్ర్కీనలతో వీక్షించనున్నారు. అందులో భాగంగా 18 పీటీజెడ్, 2 పీపుల్స్ కౌంటింగ్, 559 స్టాటెస్టిక్స్, 3 వెహికల్ నెంబర్‌ప్లేట్ డిటెక్టివ్ కెమెరాలు, 24 వాయిస్ రికార్డింగ్ కెమెరాలు, 18 హ్యాండ్ మెటల్ డిటెక్టర్స్, 150 వాకీటాకీలు, 07 డోర్ ఫ్రేం మెటల్ డిటేక్టర్లతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకునేందుకు దేవస్థానం సన్నాహాలు చేసింది.
హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు
10 ప్రధాన కూడళ్లలో వివిధ భాషలు మాట్లాడగలిగిన శివసేవకులతో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆనలైనలో 1000 మందికి పైగా ఆనలైనలో నమోదు చేసుకోగా మరో 500 మంది ఆఫ్‌లైన ద్వారా వివిధ రాకాల సేవలకు అందుబాటులో ఉన్నారు. వీరిలో కేవలం 150 మంది పురుష సేవకులు ఉండగా మిగతా వారు మహిళా సేవకులు ఉన్నారు. వీరిలో జంప్లింగ్ సిస్టం ద్వారా గర్బాలయాల్లో 100 మందిని నాలుగు షిఫ్టులుగా సేవ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు 2000కు పైగా సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.
24 గంటల వైద్య సేవలు
దేవస్థాన వైద్యశాలతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో 30 పడకల వైద్యశాలలో ఉచిత వైద్యాన్ని అందించేందుకు సిద్ధం చేశారు. అత్యవసర సమయంలో అంబులెన్సులతో పాటు 10 ప్రదేశాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో కైలాసద్వారం, టోల్‌గేట్, ఆలయ మహాద్వారం, శివదీక్షా శిబిరాలు, పాతాళగంగ స్నానఘాట్లు, మెట్లమార్గం, టూరిస్టు బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ మొదలైన ప్రాంతాల్లో వైద్య సేవలు పొందవచ్చు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో గతేడాదిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు ఈవో ఎం. శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేశనాయుడు సంయుక్తంగా పేర్కొన్నారు. ప్రధానంగా తాగునీటి సదుపాయాలు, ఉచిత బస్సులు, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాలు, 39 ఎకారాల పార్కింగ్, విద్యుద్దీపాలంకరణ, ప్రత్యేక పుష్పాలంకరణ, క్యూలైన్లను ఆధునీకరించి కంపార్టుమెంట్లను పెంచినట్లు తెలిపారు. అలాగే శివసేవకుల సహాయ కేంద్రాలు, వివిధ శాఖల నుంచి విధులు నిర్వహించేందుకు వస్తున్న అధికారులకు వసతి భోజన సదుపాయాలు, భక్తులకు నిరంతర అల్పాహార, భోజన పంపిణీ వంటి ప్రధానమైన ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. చేశాము.