దోపిడీకి స్టీల్ ముసుగు
ABN , Publish Date - Jul 11 , 2026 | 04:18 AM
పైకి బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదన.. అసలు ఉద్దేశం ఓబుళాపురం గనుల్లో దోపిడీ..! ఓవైపు స్టీల్ ప్లాంట్, ఎయిర్‌పోర్టు ఏర్పాటు పేరిట ఏకంగా 14 వేల ఎకరాలు కేటాయించగా..
ఓబుళాపురం టూ సాక్షి.. వయా బ్రహ్మణి స్టీల్స్
‘గాలి’ తెర వెనుక పార్ట్‌నర్ జగన్
అవినీతి సామ్రాజ్యానికి ఇక్కడే పునాది!
ఓబుళాపురం గనుల్లో దోపిడీ కోసమే నాడు బ్రహ్మణి స్టీల్స్ తెరపైకి
వేలాది ఎకరాల భూములు స్వాహా
గనుల తవ్వకాల్లో వేల కోట్ల అవినీతి
బినామీ కంపెనీల నుంచి ‘సాక్షి’కి నిధులు
ఆర్‌ఆర్ గ్లోబల్ 30 కోట్ల పెట్టుబడి
రెడ్ గోల్డ్ నుంచీ నిధుల మళ్లింపు
రెండింటి చిరునామా జగతి పబ్లికేషన్స్
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పైకి బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదన.. అసలు ఉద్దేశం ఓబుళాపురం గనుల్లో దోపిడీ..! ఓవైపు స్టీల్ ప్లాంట్, ఎయిర్‌పోర్టు ఏర్పాటు పేరిట ఏకంగా 14 వేల ఎకరాలు కేటాయించగా.. మరోవైపు స్టీల్ ఉత్పత్తి కోసమంటూ ఓబుళాపురం గనులు అప్పగించేశారు..! మొత్తానికి నాడు వైఎస్ హయాంలో గనుల తవ్వకాల్లో వేల కోట్ల అవినీతి జరిగింది. నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి తెర వెనుక పార్ట్‌నర్ జగన్..! జగన్ అవినీతి సామ్రాజ్యానికి ఇక్కడే పునాది పడిందనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. బ్రహ్మణి స్టీల్స్ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడంతో నాడు ప్రజాధనాన్ని, ప్రభుత్వ భూములను ఏ స్థాయిలో దోచుకున్నారనేది తాజాగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. బ్రహ్మణి సంస్థకు భూములు కేటాయించే విషయంలో నాటి వైఎస్ ప్రభుత్వం ప్రాథమిక నిబంధనలన్నింటినీ పక్కనబెట్టింది. సంస్థ సామర్థ్యాన్ని ఏమాత్రం పరిశీలించలేదు. తనకు అత్యంత సన్నిహితుడైన గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రహ్మణి స్టీల్స్ సంస్థకు నాటి సీఎం వైఎస్ ఏకంగా 14 వేల ఎకరాలు అప్పన్నంగా కట్టబెట్టారు. ఇందులో 10,760 ఎకరాలు స్టీల్ ప్లాంట్ కోసమని.. మరో 3,115 ఎకరాలు ఎయిర్‌పోర్టు కోసమని మరీ వర్గీకరించి భూ కేటాయింపులు జరిపారు.
2007 జూలై 8వ తేదీన కడప జిల్లాలో ఎకరా రూ18 వేల చొప్పున 10,760 ఎకరాలు, విమానాశ్రయం ఏర్పాటుకు ఎకరా రూ.25 వేలు చొప్పున మరో 3,115 ఎకరాల భూమి కేటాయిస్తూ జీఓ నంబర్ 785 జారీ చేశారు. 2007 జూలై 18వ తేదీన జీఓ నంబర్ 151, 152 ద్వారా అనంతపురం జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ పేరు తో 107 హెక్టార్లలో గనులు కేటాయించారు. 10 వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని నమ్మబలికా రు. ఏటా 20 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తామని ప్రగల్భాలు పలికారు. దీని కోసం ఓబుళాపురం గనులను కేటాయించారు. కానీ అవన్నీ బూటకాలని కొద్దికాలంలోనే తేలింది.
బినామీ కంపెనీల ద్వారా..
ఓబుళాపురం గనులను తవ్వుకుని దోపిడీ చేసేందుకే బ్రహ్మణి స్టీల్స్ పుట్టింది. బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ పేరుతో వేలాది ఎకరాల భూములను స్వాహా చేసిన గాలి జనార్దన్ రెడ్డికి తెర వెనుక పార్ట్‌నర్ జగన్. బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామనే పేరుతో ఆ సంస్థకు ఓబుళాపురం భూములను క్యాప్టివ్ గనుల కింద కేటాయించారు. అలాగే ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 320 ఎకరాల్లో మైనింగ్ లీజ్ ఇచ్చారు. క్యాప్టివ్ గనులుగా కేటాయించిన తర్వాత స్టీల్ ప్లాంట్ పనులు మొదలు పెట్టాల్సిన గాలి జనార్దన్ రెడ్డి అండ్ కో.. ఆ పనిని పక్కన పెట్టి ఓబుళాపురం గనుల్లో తవ్వకాలు మొదలు పెట్టారు. 2007-2009 మధ్య రెండేళ్ల కాలంలో ఓబుళాపురం మైనింగ్ స్కామ్‌కు భారీ ఎత్తున తెరలేపారు. ఉక్కు ఉత్పత్తి కోసం వినియోగించాల్సిన ఖనిజాన్ని ఎగుమతులు చేసుకుని భారీ ఎత్తున దోపిడీ చేశారు. కడపలో ఉక్కు కర్మాగారం రాలేదు కానీ వేల కోట్ల అవినీతి జరిగింది. దీనివల్ల వైఎస్ కుటుంబం లబ్ధి పొందింది. 2008 సెప్టెంబరులో ఓబుళాపురం మైనింగ్ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న బినామీ కంపెనీ రెడ్ గోల్డ్ సంస్థ జగన్‌కు చెందిన సాక్షి పత్రికను ప్రచురించే జగతి పబ్లికేషన్స్ చిరునామాతోనే రిజిస్టర్ అయింది. జగన్‌కు చెందిన ఇందిరా టెలివిజన్‌లో రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టిన మరో బినామీ కంపెనీ ఆర్‌ఆర్ గ్లోబల్ సంస్థ చిరునామా కూడా అదే. ఓఎంసీ నుంచి ఉత్పత్తి అయ్యే ఇనుప ఖనిజంలో 50 శాతం ఉత్పత్తి ఖర్చుకు కేవలం 5 శాతాన్ని అదనంగా కలిపి రెడ్ గోల్డ్‌కు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. అక్కడి నుంచి సాక్షిలోకి నిధులు వెళ్లాయి. క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారు. ఓబుళాపురం అక్రమాలపై ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. ఓఎంసీ అక్రమాలు వెలుగులోకి రావడంతో 2009, డిసెంబరు 8న సీబీఐ దర్యాప్తునకు నాటి ప్రభుత్వం ఆదేశించింది. 2012, మే 31న బ్రహ్మణి స్టీల్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దుచేశారు. కానీ 2019 లో సీఎంగా బాధ్యతలు చేపట్టాక జగన్ ఓబుళాపురం అక్రమాలను మళ్లీ మొదలు పెట్టే ప్రయత్నం చేశారు. ఓబులాపురం మై నింగ్ లీజులో తవ్వకాలు పునరుద్ధరించినా తమకెలాంటి అభ్యంతరం లేదని 2022లో ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే జగన్ ప్రభుత్వం పాచిక పారలేదు. రెండు సార్లు స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపనలు చేసి డ్రామాలాడారు. కనీసం కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టలేదు.
కియా వర్సెస్ బ్రహ్మణి
గత టీడీపీ ప్రభుత్వంలో కియా విషయం లో ఏం జరిగింది... నాడు బ్రహ్మణి విషయం లో ఏం జరిగిందో ఓసారి పరిశీలిస్తే.. దోపిడీ ఎవరిదో స్పష్టంగా అర్థమవుతుంది. కియా సంస్థకు 2014-19 మధ్య సీఎం చంద్రబాబు 536 ఎకరాలు కేటాయించారు. దేశ వ్యాప్తంగా పోటీ ఉన్నా 2017లో అనంతపురం జిల్లాకు కియా కార్ల పరిశ్రమ తెచ్చారు. నీళ్లు ఇచ్చి, పరిశ్రమ ఏర్పాటుకు సహకరించి ఉత్పత్తి ప్రారంభించారు. ఇప్పటికి దాదాపు 19 లక్షల కార్లు ఉత్పత్తయ్యాయి. ఇందులో 3 లక్షల కార్లు 90కి పైగా దేశాలకు ఎగుమతి అయ్యా యి. వైఎస్ హయాంలో బ్రహ్మణి స్టీల్స్‌కు ఏకంగా 10 వేల ఎకరాల భూములు కట్టబెట్టారు. కానీ తట్టి మట్టి పని కూడా చేయలేదు. సుమారు రూ.5 వేల కోట్ల విలువైన భూములను తీసుకుని సీమ ప్రజలను వంచించారు. క్యాప్టివ్ మైనింగ్ అంటూ ఓబులాపురం గను లు రాసిచ్చారు. ప్లాంట్ పెట్టలేదు కానీ ఓబులాపురం గనులను దోచుకున్నారు. జగన్ పార్ట్ట్‌నర్‌షి్‌పలో ఓబుళాపురంలోని ఇనుప ఖనిజా న్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేశారు. వైఎస్ హయాంలో ఇలాంటివి చాలానే చేశా రు. సరస్వతి పవర్‌కు 1,516 ఎకరాలు కేటాయించారు. 15 ఏళ్లు అయినా... నేటికి పరిశ్రమ పూర్తి చేయలేదు. ఆ భూములను తనఖా పెట్టి తెచ్చుకున్న నిధులను దారి మళ్లించారు. సెజ్‌లకు 20 వేల ఎకరాలు, లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు 8,844 ఎకరాలు, నెల్లూరులో థర్మల్ పవర్‌కు 15 వేల ఎకరాలు కేటాయించారు. కానీ ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. నిబంధనలకు విరుద్ధ్దంగా భూములు కేటాయించడం.. గనులైతే దోచుకోవడం... మామూలు భూములైతే బ్యాంకులో తనఖా పెట్టి నిధులు డ్రా చేయడం.. ఇదీ నాడు సాగించిన దోపిడీ.