Share News

హైకోర్టు తుది విచారణకు ‘బ్రహ్మణి’ న్యాయవాదులు డుమ్మా

ABN , Publish Date - Jul 11 , 2026 | 05:31 AM

స్టీల్‌ ప్లాంట్‌ భూములు, నీటి కేటాయింపుల రద్దును సవాల్‌ చేస్తూ బ్రహ్మణి ఇండస్ట్రీస్‌ 2012, 2013 ల్లో దాఖలు చేసిన 2 వేర్వేరు వ్యాజ్యాలను డీఫాల్ట్‌గా పేర్కొంటూ హై కోర్టు కొట్టివేసింది.

హైకోర్టు తుది విచారణకు ‘బ్రహ్మణి’ న్యాయవాదులు డుమ్మా

  • గత నెల 17, 23 తేదీల్లో కోర్టుకు రాని వైనం

  • 25నా అదే తీరు.. డీఫాల్ట్‌ కింద వ్యాజ్యాల కొట్టివేత

అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): స్టీల్‌ ప్లాంట్‌ భూములు, నీటి కేటాయింపుల రద్దును సవాల్‌ చేస్తూ బ్రహ్మణి ఇండస్ట్రీస్‌ 2012, 2013 ల్లో దాఖలు చేసిన 2 వేర్వేరు వ్యాజ్యాలను డీఫాల్ట్‌గా పేర్కొంటూ హై కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు ఇచ్చారు. ఉమ్మడి కడప జిల్లా జమ్మలమడుగు మండలం వేమగుంటపల్లె, కొత్తగుంటపల్లె, పి.బొమ్మేపల్లి, తుగ్గల్లపల్లి పరిధిలోని పలు సర్వే నంబర్లలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం 10,707 ఎకరాలు, విమానాశ్రయం నిర్మాణానికి 3,118 ఎకరాల భూకేటాయింపును రద్దు చేస్తూ 2013లో నాటి ప్రభుత్వం జారీచేసిన జీవోలను కొట్టివేయాలని కోరుతూ బ్రహ్మణి ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ అదనపు డైరెక్టర్‌ 2013లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే గండిపేట, మైలవరం రిజర్వాయర్‌ నుండి స్టీల్‌ ప్లాంట్‌కు నీటి కేటాయింపును రద్దు చేస్తూ జారీచేసిన జీవోపై 2012లోనే ఓ పిటిషన్‌ వేశారు. ఈ రెండు పిటిషన్లు అప్పటి నుంచి పలుమార్లు వాయిదా పడ్డాయి. ఇటీవల ఈ వ్యాజ్యాలపై హైకోర్టు తుది విచారణ చేపట్టింది. గత నెల 17వ తేదీన, 23వ తేదీన అవి విచారణకు రాగా.. బ్రహ్మణి స్టీల్స్‌ తరఫున న్యాయవాది ఎవరూ హాజరుకాలేదు. దీంతో తదుపరి విచారణ నాటికి డిస్మిస ల్‌ క్యాప్షన్‌ కింద విచారణకు వేయాలని రిజిస్ట్రీకి న్యాయమూర్తి స్పష్టం చేశారు. జూన్‌ 25న సైతం పిటిషనర్‌ తరఫు న్యాయవాది హాజరుకాకపోవడంతో.. వ్యాజ్యాలపై వాదనలు వినిపించేందుకు పిటిషనర్లు ఆసక్తి కనబరచడం లేదని అభిప్రాయపడ్డారు. డిస్మిస్డ్‌ ఫర్‌ డిఫాల్ట్‌గా పేర్కొంటూ పిటిషన్లను కొట్టివేశారు. దరిమిలా ఆయా భూములను ప్రభుత్వం ఇప్పటికే స్వాధీనం చేసుకుంది.

Updated Date - Jul 11 , 2026 | 05:32 AM