Brahmanchaudari: ప్రతి పదవీ బాధ్యతతో కూడినదే
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:11 AM
ఏపీ కమ్మ సంక్షేమ-అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నాదెండ్ల బ్రహ్మంచౌదరి బాధ్యతలు స్వీకరించారు. శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని ఎస్‌ఆర్ కన్వెన్షన్‌లో నిర్వహించిన....
అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలి: కేంద్రమంత్రి పెమ్మసాని
కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా బ్రహ్మంచౌదరి ప్రమాణ స్వీకారం
13 మంది డైరెక్టర్లు కూడా..
తాడేపల్లి టౌన్, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ఏపీ కమ్మ సంక్షేమ-అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నాదెండ్ల బ్రహ్మంచౌదరి బాధ్యతలు స్వీకరించారు. శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని ఎస్‌ఆర్ కన్వెన్షన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మరో 13 మంది డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, టీడీపీ నేతలు, కార్యకర్తల సమక్షంలో వారు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతి పదవీ బాధ్యతతో కూడినదని, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రి పెమ్మసాని సూచించారు. బ్రహ్మంచౌదరి కార్యకర్త స్థాయి నుంచి కార్పొరేషన్ చైర్మన్ స్థాయికి ఎదిగారని, పార్టీలో కష్టపడిన కార్యకర్తకు గుర్తింపు ఉంటుందనేందుకు ఇదే నిదర్శనమని తెలిపారు. బ్రహ్మం చౌదరి మాట్లాడుతూ కమ్మవారి సంస్కారాన్ని దెబ్బతీస్తూ, రాజకీయ భిక్ష పెట్టిన అధినేత కుటుంబాన్నే హేళన చేస్తూ వల్లభనేని వంశీ, కొడాలి నాని మాట్లాడారని, వారు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే చరిత్ర హీనులవుతారని చెప్పారు. అందరినీ కలుపుకొని కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మంత్రి సవిత, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రావణ్‌కుమార్, నక్కా ఆనంద్‌బాబు, నసీర్ అహ్మద్, ఎంఎస్ రాజు, జూలకంటి బ్రహ్మారెడ్డి, జ్యోతుల నెహ్రూ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీడీ జనార్థన్, కూటమి నేతలు లంకా దినకర్, కొమ్మారెడ్డి పట్టాభి, పాతూరి నాగభూషణం, నన్నపనేని రాజకుమారి, అఖిల కర్ణాటక కమ్మ సంఘం అధ్యక్షుడు గారపాటి రామకృష్ణ, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, నన్నపనేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.