ఈతకు వెళ్లి బాలుడి మృతి
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:36 PM
నంద్యాల పట్టణం పొన్నాపురం కాలనీలో 15ఏళ్ల బాలుడి మృతి తీవ్ర విషాదాన్ని నింపింది.
నంద్యాల క్రైం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): నంద్యాల పట్టణం పొన్నాపురం కాలనీలో 15ఏళ్ల బాలుడి మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. కేసీ కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లిన బాలుడు సొహైల్ శుక్రవారం పొన్నాపురం కాలనీ సమీపంలోని చెక్‌డ్యామ్ వద్ద శవమై కనిపించాడు. బాలుడి మృతితో కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. పొన్నాపురం కాలనీకి చెందిన షేక్ మక్మద్ధీన కుమారుడు సొహైల్ గురువారం మధ్యాహ్నం కేసీ కాల్వలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లాడు. వెళ్లిన కుమారుడు ఇంటికి రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు బంధువులు, స్నేహితులతో కలిసి కాల్వ పరిసరప్రాంతాల్లో రాత్రి వరకు గాలించినప్పటికీ ఆచూకీ ల భ్యం కాలేదు. శుక్రవారం ఉదయం కాలువ సమీపంలోని చెక్‌డ్యామ్ వద్ద శవమై కనిపించడంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాలుడు కాలువలో మునిగి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి తల్లి షేక్ షబానా ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.