Share News

మీరన్న మాటలే మహాశయా!

ABN , Publish Date - Apr 10 , 2026 | 04:15 AM

‘వైఎస్‌ మరణం గురించి మంత్రి అచ్చెన్నాయుడు నీచంగా మాట్లాడారు’ అని వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు

మీరన్న మాటలే మహాశయా!

  • వైఎస్‌ మృతి వెనుక జగన్‌ హస్తమంటూ నాడు బొత్స అన్నది వాస్తవం

అమరావతి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ‘వైఎస్‌ మరణం గురించి మంత్రి అచ్చెన్నాయుడు నీచంగా మాట్లాడారు’ అని వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. నిజానికి... అచ్చెన్న తన ప్రెస్‌మీట్‌లో వైఎస్‌ గురించి ఏమీ మాట్లాడలేదు. బొత్సనూ ఏమీ అనలేదు. ‘వైఎస్‌ మరణం వెనుక జగన్‌ ఉన్నారనే అనుమానాలున్నాయి’ అని స్వయంగా నాడు బొత్స పేర్కొన్నారని మాత్రమే మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. 2012 జూన్‌ 2వ తేదీన నాటి ఉమ్మడి ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడి హోదాలో బొత్స ఏమన్నారంటే...

‘‘పదవీకాంక్షతో వైఎస్‌ విజయలక్ష్మి, జగన్‌ కొనసాగిస్తున్న విధానాలను చూస్తుంటే వైఎస్ఆర్‌ మృతిపై మరిన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. రచ్చబండకు వెళ్లొద్దని చెప్పినప్పటికీ వినకుండా వెళ్లి వైఎస్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని నాడు ఇడుపులపాయలో ప్రకటించిన విజయలక్ష్మి.. ఇఫ్పుడు తన భర్త మరణంపై సందేహాలు ఉన్నాయనడం ఎంతవరకు సమంజసం. మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి బ్రహ్మానందరెడ్డికి, జగన్‌కు మధ్య ఉన్న సత్సంబంధాలే.. వైఎస్‌ మృతి వెనుక జగన్‌ ఉన్నాడన్న అనుమానాలను బలపరుస్తున్నాయి. వైఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన గాలి జనార్దనరెడ్డి కోట్లు కుమ్మరించి సీబీఐ జడ్జినే వశపరచుకోగా.. జగన్‌ కోట్ల రూపాయల ప్రలోభం చూపి ఎమ్మెల్యేలను బేరమాడుతున్నారు!’’


అధికారం కోసం ఎప్పుడూ పాకులాడలేదు!

  • అచ్చెన్న వ్యాఖ్యలు బాధాకరం: బొత్స భావోద్వేగం

అధికారం కోసం, పదవుల కోసం తానెప్పుడూ పాకులాడలేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎ్‌సఆర్‌ మరణానంతరం చోటుచేసుకున్న పరిణామాలను వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి ఆచూకీ తెలియకముందే సీఎం పదవి కోసం జగన్‌ సంతకాలు సేకరించారంటూ మంత్రి అచ్నెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను బొత్స ఖండించారు. వైఎ్‌సతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. జగన్‌పై రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయండని, వైఎ్‌సఆర్‌ మరణం ప్రస్తావన తీసుకురావడం అప్రస్తుతమని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు సహనం కోల్పోయి, రాజకీయంగా తన ఉనికిని చాటుకునేందుకు అహంభావంతో మాట్లాడారని ఆరోపించారు. మంత్రి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. రాజకీయాల కోసం, పదవుల కోసం ఇలా దిగజారతారని అనుకోలేదని, దమ్ముంటే ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు. మావిగన్‌ అంటే ఎందుకంత ఉలికిపాటు అని ప్రశ్నించారు. అమరావతి గురించి రేణుకాచౌదరి మాట్లాడిన మాటలపై స్పందించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో సభ్యత, సంస్కారం లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని బొత్స పేర్కొన్నారు. అనంతరం వైఎస్‌ పాదయాత్ర ప్రారంభించి 23 ఏళ్లు గడిచిన సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ నేతలతో కలిసి ఆయన కేక్‌ కట్‌ చేశారు.

Updated Date - Apr 10 , 2026 | 04:16 AM