జోగి మాటల్లో తప్పేముంది?
ABN , Publish Date - Feb 08 , 2026 | 05:25 AM
వైసీపీ నేతలపై దాడులు చూస్తుంటే మంత్రి లోకేశ్‌కే కాదు చంద్రబాబుకు కూడా చిప్ పోయిందనిపిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు.
చంద్రబాబుకు కూడా చిప్ పోయిందేమో.. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ
మాజీ మంత్రి జోగికి పరామర్శ
విజయవాడ /ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతలపై దాడులు చూస్తుంటే మంత్రి లోకేశ్‌కే కాదు చంద్రబాబుకు కూడా చిప్ పోయిందనిపిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్‌ను ఆయన శనివారం పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, జోగి ఇంట్లో ఉన్న వారందర్నీ మట్టుబెట్టాలనుకోవడం దుర్మార్గమని అన్నారు. ఈ దాడి క్షణికావేశంలో జరిగింది కాదని, పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు జరిగిందేనని చెప్పారు. చిప్ పోయిందని అంటే తప్పా? అంటూ జోగి వ్యాఖ్యలను సమర్థించారు. బుర్ర పాడై ఇంగిత జ్ఞానం కోల్పోతేనే దాడుల ఆలోచనలు వస్తాయన్నారు. అంబటి, జోగి ఇళ్లపై దాడి చేయడం సరైన పనా? టీడీపీ తప్ప ఎవరూ బతకకూడదా? అని ప్రశ్నించారు. దాడులను అడ్డుకోవాల్సిన పోలీసులు, దాడి చేసినవారితో కలిసి నడుచుకుంటూ రావడం ఏమిటన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంస్కృతి ఇప్పటి వరకు లేదన్నారు. ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది కాబట్టి తప్పు చేస్తే శిక్షించండి అంటూ సలహా ఇచ్చారు. ఇక తిరుపతి లడ్డూ విషయంలో స్పందిస్తూ.. చంద్రబాబు చెప్పిందే వేదం అనుకుంటే ఎలా? ఆయనేమైనా మహర్షా అన్నారు. దేవుడితో రాజకీయాలు వద్దని, తప్పు చేస్తే, తప్పు మాట్లాడితే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడని అన్నారు. లడ్డూ వ్యవహారంలో వన్ మ్యాన్ కమిటీ ఎందుకని, కూటమిలోని మూడు పార్టీల నుంచి ముగ్గురితో కూటమి కమిటీ వేసుకుని ఏదొక నివేదిక ఇచ్చుకోండంటూ వ్యంగ్యంగా సూచించారు. పవన్ సనాతన ధర్మం ఏమిటో, ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకుంటే మంచిదన్నారు. ఆయన మాటల్ని ప్రజలు అందరూ చూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందంటూ విమర్శించారు. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేశ్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.