కల్తీ పాల ఘటన ప్రభుత్వ అసమర్థతే: బొత్స
ABN , Publish Date - Feb 25 , 2026 | 04:15 AM
రాజమండ్రిలో వెలుగుచూసిన కల్తీ పాల ఘటన ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు.
అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): రాజమండ్రిలో వెలుగుచూసిన కల్తీ పాల ఘటన ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. కల్తీ పాలు తాగి ఐదుగురు చనిపోయినా ఇప్పటివరకు ఒక్కరిపైనైనా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. తప్పు చేస్తే ప్రభుత్వం శిక్షిస్తుందన్న భయం లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. మంగళవారం ఆయన వైసీపీ ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యలు, మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువైపోయాయని ఆరోపించారు.