Share News

బొత్సకు మళ్లీ స్వల్ప అస్వస్థత

ABN , Publish Date - Mar 07 , 2026 | 05:15 AM

శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మళ్లీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చివరి రోజు శాసన మండలి సమావేశాలకు...

బొత్సకు మళ్లీ స్వల్ప అస్వస్థత

  • శాసన మండలి సమావేశాల్లో రక్తపోటుతో ఇబ్బంది

  • అసెంబ్లీ వైద్యుల చికిత్స.. నిలకడగా ఆరోగ్యం

అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మళ్లీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చివరి రోజు శాసన మండలి సమావేశాలకు హాజరైన ఆయన రక్తపోటు(బీపీ) పెరిగి ఇబ్బంది పడ్డారు. ఇంటి భోజనం చేసే అలవాటున్న బొత్స మధ్యాహ్న భోజనం చేయడం ఆలస్యమైంది. దీంతో రక్తపోటు పెరిగింది. అసెంబ్లీ ఆవరణలోని డాక్టర్‌ వచ్చి పరీక్షించారు. హైబీపీగా నిర్ధారించి మాత్రలు వేశారు. ఆ తర్వాత ఆయన కొంతమంది ఎమ్మెల్సీలతో కలిసి ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత హైదరాబాద్‌ న్యూరో ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ చంద్రశేఖర రెడ్డితో చర్చించారు. విశ్రాంతి తీసుకోవాలని, ఏదైనా ఇబ్బందిగా ఉంటే వెంటనే హైదరాబాద్‌కు వచ్చేయాలని ఆయన సూచించారు. కాగా, గత నెల 27న కూడా బొత్స అనారోగ్యానికి గురై హుటాహుటిన హైదరాబాద్‌ సిటీన్యూరో ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం తిరిగొచ్చారు. ఈ నెల నాలుగో తేదీ నుంచి శాసనమండలి సమావేశాలు పునఃప్రారంభమైనప్పటికీ, రెండు రోజులు బొత్స హాజరుకాలేదు. శుక్రవారం చివరిరోజు సమావేశాలకు హాజరైన ఆయన మళ్లీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బొత్స ఆరోగ్యంపై ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ ఆరా తీశారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైసీపీ ఎమ్మెల్సీలు వెల్లడించారు.

Updated Date - Mar 07 , 2026 | 05:16 AM