Share News

రూ.30 లక్షలకే 30 ఎకరాలు

ABN , Publish Date - Feb 13 , 2026 | 04:38 AM

ప్రతిష్ఠాత్మకమైన ‘గీతం’ యూనివర్సిటీకి భూమి ఇవ్వడాన్ని తప్పుబడుతున్న శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ.. తాను మాత్రం ఎంచక్కా ప్రభుత్వ భూములు సొంతం చేసుకున్నారు.

రూ.30 లక్షలకే 30 ఎకరాలు

  • జగన్‌ జమానాలో బొత్స కుటుంబానికి అయాచిత లబ్ధి

  • పెట్టని పరిశ్రమకు గ్రోత్‌ సెంటర్‌లో భూములు

  • అడ్డగోలుగా కేటాయించిన వైసీపీ

  • ఇప్పుడు ‘గీతం’ భూముల క్రమబద్ధీకరణపై యాగీ

విశాఖపట్నం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మకమైన ‘గీతం’ యూనివర్సిటీకి భూమి ఇవ్వడాన్ని తప్పుబడుతున్న శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ.. తాను మాత్రం ఎంచక్కా ప్రభుత్వ భూములు సొంతం చేసుకున్నారు. పెట్టని పరిశ్రమ పేరుతో... రూ.30 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.30 లక్షలకే తీసేసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లో ఇథనాల్‌ డిస్టిలరీ యూనిట్‌ పెడతామని, 30 ఎకరాలు కేటాయించాలని బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్‌, కుటుంబ సభ్యులు ఆదినారాయణ, శ్రీధర్‌, సతీశ్‌కుమార్‌ ఏపీఐఐసీకి 2023 జూన్‌లో దరఖాస్తు చేశారు. రోజుకు 200 కిలోలీటర్ల ఇథనాల్‌ తయారు చేస్తామని, రూ.235 కోట్ల పెట్టుబడి పెడతామని, 200 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. అక్కడ భూమి విలువ ఎకరా రూ.కోటి ఉందని, రూ.30 కోట్లు చెల్లించాలని ఏపీఐఐసీ సూచించగా, తాము అంత చెల్లించలేమని, ఎకరా రూ.10 లక్షలకే ఇవ్వాలని కోరారు. నాటి సీఎం జగన్‌ ఆదేశాలతో వారు అడిగిన ధరకే ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. అంటే ఎకరా రూ.10 లక్షల చొప్పున 30 ఎకరాలను 3కోట్లకు ఇచ్చేశారు. అయితే బొత్స కుటుంబం రూ.30లక్షలే చెల్లించి భూమిని స్వాధీనం చేసుకుంది. అందులో ఇప్పటివరకూ పరిశ్రమ ఏర్పాటుచేయలేదు. అదే సమయంలో లక్షలాది మందికి విద్యాబోధన చేసి, వేలాది మందిని వివిధ దేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లోకి పంపిన గీతం యూనివర్సిటీ...ఎప్పటినుంచో తమ ఆధీనంలో ఉన్న 54 ఎకరాలను క్రమబద్ధీకరించాలని కోరితే బొత్స తప్పుబడుతున్నారు. శాసనమండలిలో నానా యాగీ చేస్తున్నారు.

‘గీతం’లో జరిగిందేమిటి?

మంత్రి లోకేశ్‌కు ‘గీతం’ అధ్యక్షుడు శ్రీభరత్‌ తోడల్లుడు కావడం వల్లే విలువైన భూములు కట్టబెడుతున్నారంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. వాన్తవానికి గీతం అధ్యక్షులుగా ఎంవీవీఎస్‌ మూర్తి ఉన్నపుడే ఆ భూమిని క్రమబద్ధీకరించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నారు. సొంత కుటుంబ సభ్యులకు మేలుచేయాలని చంద్రబాబు భావిస్తే...ఆనాడే గీతంకు ఆ భూములు ఇచ్చేసి ఉండేవారు. కానీ నిబంధనలు, షరతులు, ప్రభుత్వ అవసరాలు అన్నీ చూసుకొని... వాయిదా వేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ భూములను రాత్రికి రాత్రి వందలాది మంది పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో వెళ్లి, బీచ్‌ రోడ్డును స్తం భింపజేసి, తెల్లవారేసరికి స్వాధీనం చేసుకుంది. గీతం యాజమాన్యం ఆ భూమిలో కంచె కూడా వేయలేదు. అనేక విద్యా సంస్థలకు భూములు తక్కువ ధరకు ఇస్తున్నారని, దశాబ్ద కాలం నుంచి అడుగుతుంటే తమకు ఇవ్వడం లేదని, యూనివర్సిటీ విస్తరిస్తున్నామని, మరెంతో మందికి ఉపయోగపడుతుందని కోరితే, ఇప్పుడు మంత్రివర్గం దానిని పరిశీలనలోకి తీసుకుంది.

Updated Date - Feb 13 , 2026 | 04:38 AM