‘చట్టబద్ధత’ తీర్మానం దేనికీ పనికిరాదు: బొత్స
ABN , Publish Date - Mar 31 , 2026 | 06:28 AM
రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు మరోసారి అక్కసు వెళ్లగక్కారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలని...
శ్రీకాకుళం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు మరోసారి అక్కసు వెళ్లగక్కారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలని కేంద్రాన్ని కోరుతూ శనివారం అసెంబ్లీ చేసిన తీర్మానానికి విలువ లేదన్నారు. మూలపేట పోర్టు పనులు జగన్ హయాంలోనే 75 శాతం పనులు పూర్తిచేసేశారని.. ఆ క్రెడిట్ జగన్‌కే పూర్తిగా చెందుతుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం వద్ద నిర్మిస్తున్న మూలపేట పోర్టు వద్దకు వెళ్లాలని వైసీపీ నేతలు భావించారు. సోమవారం ‘మూలపేట పోర్టు చూసొద్దాం’ అనే కార్యక్రమంతో హడావుడి చేయాలనుకున్నారు. అయితే పోర్టులోకి వెళ్లేందుకు అనుమతి నిరాకరించడంతో చివరకు నౌపడ వద్ద సభ జరిపారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘సంపద అంతా అమరావతిలోనే పెడితే ఎలా? అన్నారు. మూలపేట పోర్టు క్రెడిట్ కొట్టేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు చూస్తున్నారు. జగన్ చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకునేందుకు సిగ్గులేకుండా క్రెడిట్ పాలిటిక్స్ చేస్తున్నారు’ అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు.