బాట్‌లే ఆటగాళ్లు!
ABN , Publish Date - Sep 28 , 2026 | 03:27 AM
ఆన్‌లైన్ రమ్మీ పేరుతో గేమ్స్‌క్రాఫ్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల నిర్వాహకులు ఆటగాళ్లను స్వయంచాలక ‘బాట్స్’తో మోసం చేసిన విషయాన్ని ఈడీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు.
ఆన్‌లైన్ రమ్మీలో మోసం!
గేమ్స్ క్రాఫ్ట్‌పై మళ్లీ ఈడీ చర్యలు
రూ.442.35 కోట్ల
ఆస్తులు అటాచ్
నిషేధం ఉన్నా
ఏపీ, తెలంగాణలోనూ గేమ్
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ రమ్మీ పేరుతో గేమ్స్‌క్రాఫ్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల నిర్వాహకులు ఆటగాళ్లను స్వయంచాలక ‘బాట్స్’తో మోసం చేసిన విషయాన్ని ఈడీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. ఆటగాళ్లు భారీగా నష్టపోగా నిర్వాహకులకు భారీగా ఆదాయం సమకూరింది. ఈ వ్యవహారంపై ఈడీ మరింత ఉచ్చు బిగించింది. రమ్మీ కల్చర్ యాప్ తదితర వాటికి సంబంధించి మరో రూ.442.35 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో నమోదైన పలు మోసం కేసుల ఆధారంగానే ఈడీ ఈ సంస్థలపై మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభించింది. మే, జూన్ నెలల్లో గేమ్స్‌క్రాఫ్ట్ కార్యాలయంతోపాటు సంస్థ డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. గేమ్స్‌క్రాఫ్ట్ టెక్నాలజీస్, రమ్మీటైమ్ టెక్నాలజీస్ సంస్థలు రమ్మీకల్చర్, రమ్మీప్రైమ్, ప్లేషిప్, రమ్మీటైమ్ పేర్లతో నగదు ఆధారిత ఆన్‌లైన్ ఆటలు నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఈ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌కు 3 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. నగదు ఆధారిత ఆన్‌లైన్ గేమింగ్‌పై నిషేధం ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఉన్నారని, ఆటగాళ్లు పందెంగా పెట్టే మొత్తంపై ఈ సంస్థలు 10 నుంచి 15 శాతం వరకు కమీషన్ వసూలు చేశాయని ఈడీ అధికారులు తెలిపారు. సుమారు రూ.1,035 కోట్లను ప్రచారం, మార్కెటింగ్ కోసం ఖర్చు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు అటాచ్ చేసిన, స్తంభింపజేసిన, స్వాధీనం చేసుకున్న ఆస్తుల మొత్తం విలువ సుమారు రూ.2,843 కోట్లకు చేరినట్లు ఈడీ అధికారులు ప్రకటనలో వివరించారు.