ఇద్దరూ ఇద్దరే!
ABN , Publish Date - Mar 26 , 2026 | 12:34 AM
‘‘పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ చూడడంలేదు అనుకున్న చందంగా ఉంది విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తీరు. ప్రజా సంబంధాలకు దూరం ఉండే ఈ విభాగంలో వైసీపీ హయాం నుంచి ఉన్న ఇద్దరు పాతకుపోయి పైరవీల చక్రాన్ని తిప్పుతున్నారు. బదిలీ చేసినా విధులు మాత్రం ఇక్కడే నిర్వహిస్తానని మొండి పట్టుపడతాడు ఓ అధికారి. మిమ్మల్ని విడిచి నేనెక్కడికి వెళ్లను అంటాడు మరో ఉద్యోగి. నాడు వైసీపీ ప్రభుత్వంలో విజయవాడలోని ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయానికి వచ్చిన ఈ ఇద్దరి వ్యవహారం జిల్లాలో తాజాగా చర్చనీయాంశంగా మారింది. వారి విజ్ఞాపనలకు అధికారులు తల ఊపుతూ కానివ్వండంటూ పచ్చజెండాలు ఊపడం గమనార్హం.
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఏడేళ్లుగా తిష్ట
వైసీపీ హయాంలో వచ్చి నేటి వరకు పాగా
స్థానం మార్పు చేసినా ఇక్కడే విధులు
మాఫియాలతో మంచి సంబంధాలు
ఇద్దరు ఘనులకు ఉత్తమ సేవా పతకాలు
‘‘పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ చూడడంలేదు అనుకున్న చందంగా ఉంది విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తీరు. ప్రజా సంబంధాలకు దూరం ఉండే ఈ విభాగంలో వైసీపీ హయాం నుంచి ఉన్న ఇద్దరు పాతకుపోయి పైరవీల చక్రాన్ని తిప్పుతున్నారు. బదిలీ చేసినా విధులు మాత్రం ఇక్కడే నిర్వహిస్తానని మొండి పట్టుపడతాడు ఓ అధికారి. మిమ్మల్ని విడిచి నేనెక్కడికి వెళ్లను అంటాడు మరో ఉద్యోగి. నాడు వైసీపీ ప్రభుత్వంలో విజయవాడలోని ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయానికి వచ్చిన ఈ ఇద్దరి వ్యవహారం జిల్లాలో తాజాగా చర్చనీయాంశంగా మారింది. వారి విజ్ఞాపనలకు అధికారులు తల ఊపుతూ కానివ్వండంటూ పచ్చజెండాలు ఊపడం గమనార్హం.
(ఆంధ్రజ్యోతి - విజయవాడ):
ఏలూరు రేంజ్ పరిధిలో ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయం విజయవాడ వెంకటేశ్వరనగర్ కాలనీలో ఉంది. ఇందులో తూర్పు గోదావరి జిల్లాకు మూడు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాకు రెండేసి చొప్పున ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఉంటాయి. ఈ పోస్టుల్లో ఆయా జిల్లాలకు సంబంధించిన ఇన్‌స్పెక్టర్లను ప్రాంతీయ కార్యాలయంలో నియమిస్తారు. అటువంటిది ఏలూరు రేంజ్‌కు ఏమాత్రం సంబంధంలేని ఓ ఇన్‌స్పెక్టర్ పొరుగు రేంజ్ నుంచి ఇక్కడికి వైసీపీ ప్రభుత్వంలో వచ్చారు. ఇక్కడ అన్ని పోస్టుల్లో ఇన్‌స్పెక్టర్లు ఉన్నప్పటికీ నిబంధనలు ఏమాత్రం పట్టని వైసీపీ నేతలు ఆయనను విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయానికి రప్పించుకున్నారు. అదే సమయంలో ఆయనతోపాటు విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేసే ఓ కానిస్టేబుల్‌ను విజిలెన్స్ కార్యాలయంలో కూర్చోబెట్టారు. ఏడేళ్లుగా ఇద్దరూ ఇక్కడే విఽధులు నిర్వర్తిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ ఇన్‌స్పెక్టర్‌కు డీఎస్పీ పదోన్నతి ఇచ్చి అధికారులు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వర్తించాల్సిన ఆయన డీఎస్పీ హోదాలో తిరిగి ప్రాంతీయ విజిలెన్స్ కార్యాలయానికి రావడం మొదలుపెట్టారు. ఇక్కడే సీట్లో కూర్చుని విధులు నిర్వర్తించారు. తర్వాత ఆయనకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రధాన కార్యాలయంలో అటాచ్‌మెంట్ ఇచ్చారు. అటాచ్‌మెంట్ ఇచ్చిన చోట కాకుండా విజయవాడలోని విజిలెన్స్ కార్యాలయంలో రెగ్యులర్‌గా విధులు నిర్వర్తిస్తుండడం గమనార్హం. ఈయనతోపాటు విజిలెన్స్‌కు వెళ్లిన కానిస్టేబుల్‌ను తిరిగి కమిషనరేట్‌కు పంపాలని అధికారులు ఏడు నెలల క్రితం ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ ఉత్తర్వులు అమలు కాలేదు. ఈ కానిస్టేబుల్‌ను రిలీవ్ చేయకుండా ఆ డీఎస్పీ స్థాయి అధికారి కాపాడుకుంటూ వస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రాంతీయ కార్యాలయంలోని సీటుపై ఈ అధికారికి అంత మమకారం ఎందుకని ఆరా తీస్తుంటే మాఫియాలతో ఉన్న లింక్‌లు బయటపడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కొద్దిరోజుల క్రితం జయంతి గ్రామానికి చెందిన పీడీఎస్ బియ్యం డాన్ కాజా సత్యనారాయణపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ సమయంలో విజిలెన్స్‌లో ఉన్న ఈ అధికారి, కానిస్టేబుల్ పేర్లు ప్రధానంగా వినిపించడం గమనార్హం. దీంతోపాటు ఇసుక, గ్రావెల్ మాఫియాను నడుపుతున్న వారితో ఈ ఇద్దరికి మంచి సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
రేంజ్‌లో లేని వారికి ‘ఉత్తమ’ గుర్తింపు
వైసీపీ హయాంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాంతీయ కార్యాలయానికి వచ్చిన ఈ డీఎస్పీ, కానిస్టేబుల్ ఉమ్మడి జిల్లాలో అన్ని రకాల మాఫియాలను పెంచి పోషించారన్న ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి. అయినా వారికి ఉగాది పురస్కారాలు ప్రదానం చేసి సత్కరించడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం అధికారులు పురస్కారాలకు పేర్లను సిఫార్సు చేసినప్పుడు రేంజ్ పరిధిలో ఉన్నవారిని మాత్రమే ప్రతిపాదించాలి. డీఎస్పీకి ఏలూరు రేంజ్‌తో ఎలాంటి సంబంధం లేకపోయినా పురస్కారానికి అధికారులు సిఫార్సు చేశారు. ఆయనకు ఉగాది రోజున సేవా పతకాన్ని ప్రదానం చేశారు. ఆయనతోపాటు కానిస్టేబుల్ పేరునూ సిఫార్సు చేశారు. ఆయన రేంజ్ పరిధిలోని ఉద్యోగి కావడంతో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు.